ఎంతమందిని తొక్కుతవ్!
- సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
* నాకు ఎవడైనా అడ్డంవస్తే తొక్కుతా అని రేవంత్‌రెడ్డి అంటున్నాడు.. ఎంతమందిని తొక్కుతావయ్యా నువ్వు రేవంత్‌రెడ్డీ.. నన్ను తొక్కుడు నీవల్లకాదు రేవంత్‌రెడ్డి. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. నీ అడుగులకు మడుగులొత్తేవారు నీకు కావాలి. మిమ్మల్ని ఎదిరించేవారు వద్దు.. రాహుల్‌గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవారిని అణగదొక్కుతున్నారు. నువ్వు అణగదొక్కుతుంటే భరించడంకన్నా పోరాటం చేయడమే మేలు. పోరాడితే పోయేదేముంది?
* జగిత్యాల రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 45 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ అనుబంధానికి సీనియర్ నేత జీవన్‌రెడ్డి చెల్లుచీటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో తనకు పొసగదని కొద్దినెలలుగా కరాఖండీగా చెబుతున్న జీవన్‌రెడ్డి ఎట్టకేలకు బుధవారం జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
* వేం నరేందర్‌రెడ్డి ఎవడు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది?.. ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం. పార్టీలోకి ఆయనను ఎందుకు తెచ్చుకున్నట్లు.. బ్రతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. వాడు ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా? నేను ప్రభుత్వ సలహాదారు పద వికి కూడా పనికిరాకుండా పోయానా?.
* ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. చంద్రబాబును, కేసీఆర్‌ను ఎదిరించి పోరాటం చేసిన. రేవంత్‌రెడ్డిపై పోరాటంచేస్తా.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. నేను సీఎం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నువ్వు సీఎం అయ్యేటప్పుడు ఎవరూ అడ్డుపడవద్దని పార్టీలో అనేకమంది నాయకులకు నేనూ చెప్పాను.
* కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డికి తీవ్ర అవమానం జరి గింది. గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మె ల్యే టికెట్ ఇచ్చి, వాపస్ తీసుకున్నారు. అది గుర్తుకువచ్చి ఇటీవల ఆయన ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన టికెట్ వాపస్ తీసుకున్నరోజు, తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చిన్నారెడ్డి కార్యకర్త లకు చెప్పారు. ఇదీ చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించిన గౌరవం.
- జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ
- జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో కీలక సమావేశం
- కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు
- కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు
- పార్టీలో సరైన గుర్తింపు లేదు.. ఆత్మగౌరవం లేని చోట తప్పుకోవడమే మేలు
- రేవంత్‌రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా
జగిత్యాల, మార్చి 25 (విజయక్రాంతి): మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలు చివరి వర కు బుజ్జగించినా ఆయన వినలేదు. బుధవారం జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో ఇందిరా భవన్ నుంచి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా వేసుకొని స్థానిక జంబి హనుమాన్ ఆలయం వరకు కాలినడక వెళ్లారు.
కొబ్బరికాయ కాయ కొట్టి, పూజలు చేసి, స్థానిక బండారి గార్డెన్ వరకు వాహనంలో వెళ్లారు. అక్కడ నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా లేఖ ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, పీసీసీ కార్యాలయాలకు పంపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నాకు సంతో షం లేకుండా చేశారు. గత 20 నెలలుగా మానసిక వేదనకు గురయ్యాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఈ వయసులో నాకు బయటకు వెళ్లాలని లేదు. 20 నెలలుగా నన్ను కించపరుస్తూ, అడుక్కునే స్థాయికి తీసుకువస్తే ఏం చేయాలి. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఎమ్మెల్యే కు అండగా ఉంది అనుకున్న. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా జతగా మారింది. మీనాక్షి నటరాజన్ 80 శాతం మీకే ప్రాధాన్యత ఉంటుందని హమీ ఇచ్చారు. నేను మంత్రి పదవికి అర్హుడిని కాదా? సోనియా గాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయించుకున్న తర్వాత పెట్టుబడిదారులు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక లు ఉన్నాయని వాయిదా వేశారు.
నన్ను ఎదగకుండా అణగదొక్కాలని రేవంత్‌రెడ్డి ఆలోచన. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఆత్మగౌర వం లేని చోట కొనసాగడం కంటే తప్పుకోవడమే మేలని భావించినట్లు స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవాలని ఎవరూ కోరుకోరని, విధి లేని పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి మిత్రులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు తోడ్పడ్డారని పేర్కొన్నా రు.
1984లో కాంగ్రెసులో చేరానని, ఎన్నికల్లో గెలవడం, ఓడటం సహజం అని చెప్పారు. 1996 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లక్ష ఓట్లు పోలైతే 54 వేల మెజార్టీతో గెలుపొందాను అని, ఉప ఎన్నికల్లో 73 శాతం ఓట్లతో గెలుపొందిన చరి త్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్‌పై 2006, 2008 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేశాను.
2014 ఎన్నికల్లో రాష్ట్రం లో బీఆర్‌ఎస్ గెలుపొందితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడినా 2019 ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా ఒంటరి పోరాటం చేశానని గుర్తు చేశారు. ‘మిగిలిన రెండేళ్లు మన హక్కుల కోసం ధర్మ కోసం పోరాటం చేద్దాం.. నాకు అండగా నిలువండి’ అని కార్యకర్తలకు సూచించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నుంచి పోటీ!
దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమని, అందుకే సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సీఎం రేవంత్ నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెం ట్ మహబూబ్‌నగర్‌లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతామహేందర్‌రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి తర్వాత బీఆర్‌ఎస్ నుంచి రంజిత్‌రెడ్డిని తెచ్చి టికెట్ ఇవ్వడంతో ఓడిపోయిందన్నారు. ‘వేం నరేందర్‌రెడ్డి ఎవరు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది? బతకడానికి వచ్చిన పోచా రం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా’ అని ప్రశ్నించారు.
జీవన్‌రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాం: కార్యకర్తలు
జీవన్‌రెడ్డి వెంటే నడుస్తామని, జగిత్యాల నుంచి మరో జైత్ర యాత్ర మొదలవుతుందని జీవన్‌రెడ్డి అనుచరులు, కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అవమానించిన తీరుపై నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కి అండగా నిలుస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన జీవన్ రెడ్డికి మద్దతు నిలుస్తామన్నారు.
ఎంతమందిని తొక్కుతావు రేవంత్?
‘నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్‌రెడ్డి అంటున్నాడు. ఎంతమంది ని తొక్కుతావయ్య రేవంత్‌రెడ్డి, జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, కానీ మమ్మల్ని కూడా బతకని వ్వు’ అని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి రేవంత్‌రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానని, అణగదొక్కబడటం కంటే పోరా టం చేస్తే తనకు పోయేది ఏమీ లేదన్నారు.
ఎదిరించి పోరాటం చేయడం తనకు కొత్త కాదని, చంద్రబాబును, కేసీఆర్‌ను ఎదిరించి పోరాటం చేశానని, రేవంత్‌రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానని చెప్పారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికి పార్టీలో స్థానం కల్పించి, పార్టీ కార్యకర్తల హక్కులను దోచుకున్నారని మండిపడ్డారు. దశాబ్దాల తరబడి తనకు అండగా నిలిచిన నాయకుడు గంగారెడ్డి అతి కిరాతకంగా హత్యకు గురైతే స్పందించలా వద్దా అని ప్రశ్నించారు.
ఓ కాంగ్రెస్ కార్యకర్త దారుణం గా చంపబడితే కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం జరిగింది అని కూడా అడుగలేద న్నారు. కార్యకర్తల శ్రమతో రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, కనీసం కార్యకర్తకు అండగా నిల్వకపోవడంతో జీర్ణించుకోలేక ఏఐసీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. కార్యకర్తలు బలి అవుతుంటే వారికి అండగా నిలవకుండా పార్టీ లో ఏవిధంగా కొనసాగాలని ప్రశ్నించారు. దేవుడు అవకాశం ఇస్తే జగిత్యాలను జాతీ య స్థాయిలో గుర్తు వచ్చేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.




