calender_icon.png 9 February, 2026 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసుంటే ‘అవరోధాలే.. అవకాశాలు’

09-02-2026 12:09:59 AM

వ్యక్తి వికాస రచయిత కోట దామోదర్ తాజా ‘అవరోధాలే అవకాశాలు’ అనే వ్యాస సంపుటి పాఠకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక అద్భుతమైన పుస్తకం. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ, అవమానాలను ఓర్పుగా మోస్తూ, కన్నీళ్లను ధైర్యంగా తుడుచుకుంటూ నిలబడ్డ అసాధారణ వ్యక్తుల ప్రయాణాలు పుస్తకానికి ప్రాణం పోశాయి.

దీనిలోని ప్రతి వ్యాసం కేవలం ఒక వ్యక్తి గెలుపు కథ మాత్రమే కాదు, ఓడిపోకుండా నిలబడిన మనిషి తాలూకు మనోబలానికి నిలువెత్తు సాక్ష్యం. పరిస్థితులు వెనుకడుగు వేయమని కుంగదీసినా, ముందడుగు వేయాలని మనసు చెప్పినప్పుడు జీవితం ఎలా మలుపు తిరు గుతుందో ఈ వ్యాసాలు కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. రచయిత తన అనుభవాలను, ఆశలను, ఆవేదనలను ఎంతో సూటిగా పాఠకుల హృదయాల్లో నాటారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కోట దామోదర్, తన కొలువు చేసుకుంటూనే రచనా వ్యాసాంగం వైపునకూ మళ్లారు. ఆయన తాజా పుస్తకంలో మొత్తం 27 వ్యాసాలున్నాయి. ఈ సంపుటి పాఠకులకు జీవితం పైన సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. నిరంతర సాధన, పట్టుదలతో సామాన్యులు అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.

సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా, ధైర్యం, దృృఢ సంకల్పంతో ముందుకు సాగాలనే సందేశం ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. వైకల్యాన్ని జయించి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన పూర్ణసుందరి యథార్థ గాథ ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకులు కాదని, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యాన్నైనా జయించవచ్చని ఆమె జీవితం నిరూపిస్తుంది. ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జీవితాన్ని రచయిత స్ఫూర్తివంతంగా చిత్రించారు.

అలుపెరుగని కృషి, అచెంచలమైన పట్టుద లతో తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ రికార్డులను తిరగరాసి విశ్వవిజేతగా నిలిచినా, ‘నేను మీలాం టి సామాన్యుడినే’ అని బోల్ట్ చెప్పుకోవడం పాఠకులను ఆకర్షిస్తుంది. బోల్ట్ కు చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉన్నా, కోచ్ సలహాతో రన్నింగ్ వైపు అడుగులు వేయడం అతని జీవితాన్ని మార్చేసింది. సరైన మార్గనిర్దేశం, కష్టం, వినయం తోడైతే అసాధ్యమనేది ఉండదని ఈ బోల్ట్ జీవతం గొప్పపాఠం చెబుతుంది.

ఐపీఎల్‌లో రాణించి ‘గెలుపునకు వయసు అడ్డంకి కాదు’ అని నిరూపించిన ప్రవీణ్ తాంబే ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. సాటి మనుషుల పట్ల ప్రేమ, సేవా తత్పరత కలిగి ఉండటమే జీవిత పరమార్థమని మదర్ థెరిసా సందేశాన్ని ఒక వ్యాసంలో రచయిత వివరించారు. పద్మశ్రీ కేఎస్ రాజన్న సామాజిక సేవ దివ్యాంగులకే కాకుండా, నేటి యువతకూ ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది.

నేటి విద్యా వ్యవస్థలో కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల విషయ పరిజ్ఞానం లోపిస్తోందని, జ్ఞాన సముపార్జన కంటే ర్యాంకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని రచయిత తన ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఏడేళ్ల కఠినశ్రమతో చేనేత కార్మికుల కష్టాలు తీర్చడానికి ’లక్ష్మీ ఆసు’ యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆవిష్కరణలకు పట్టుదల ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మంచి మనసే అసలైన సంపద అనే సందేశాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా రచయిత పాఠకులకు అందించారు. సమానత్వం కోసం, విద్యనభ్యసించే హక్కు కోసం న్యాయస్థానంలో పోరాడిన ఒక ఉద్యమ వీరుడి గాథ ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో బలంగా చాటారు. ఇవి కేవలం వ్యాసాలు కావు జీవితానికి దారి చూపే దీపాలు. నిరాశలో ఉన్నవారికి విశ్వాసం, అలసిపోయిన వారికి ఉత్తేజం, సంకల్పం కోల్పోయిన వారికి స్ఫూర్తి.

అవరోధాలే అవకాశాలవుతాయని నమ్మించే శక్తి ఈ పుస్తకానికి ఉంది. జీవితం ఎదురయ్యే ప్రతి కష్టాన్నిఒక పాఠంగా, ఒక మెట్టుగా మార్చుకోవచ్చని ఈ పుస్తకం మౌనంగా చెబుతుంది. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని, జీవితం పట్ల ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠకులలో నింపుతుంది. పేదరికం, ఆకలి, పరిమితులు, ఓటమి విజయానికి అడ్డంకులు కావనిసంకల్పబలం, నిరంతర కృషి ఉంటే పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజయాల దాకా ఎదగవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది.

గెలుపుఓటములు జీవితంలో సహజమని, వాటికి అతిగా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా సమతా భావంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమని ఈ వ్యాసాలు బోధిస్తాయి. మొత్తం మీద, ఈ రచనలు ప్రతి పాఠకుడిలో ధైర్యం, ఆశ, లక్ష్యసాధన పట్ల విశ్వాసం పెంపొందించడమే ప్రధాన సందేశం గా నిలుస్తాయి. వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

డర్బన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ సౌత్ ఆఫ్రికా

+27 847828059

 రవీందర్ రేనా