కేటీఆర్ వస్తే.. బీజేపీ రాష్ట్రాల అభివృద్ధిని చూపిస్తా
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకం
- తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు
- పవన్ ఇంటికి మోదీ వెళ్తే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి
- జనసేనతో ఎన్నికల పొత్తు.. జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌వి సెంటిమెంట్ డ్రామాలు
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ
- సీబీఐతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైన విచారణ జరిపించాలి
- మన కృష్ణా జలాల వాటాను కర్ణాటకకు రాసిచ్చారు
- కర్ణాటక, తెలంగాణలోనూ మా జెండా ఎగురుతుంది
- మీట్ ది ప్రెస్‌లో పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ రాంచందర్‌రావు
* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వని అంశాన్ని కొందరు వివాదం చేస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు. పవన్ కళ్యాణ్‌కి అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అనుమతి ఇచ్చి ఉంటే కథ అక్కడే ముగిసేది. తప్పు ను బీజేపీపై రుద్దాలని చూడటం దివాళాకోరుతనం.
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లి కలిస్తేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసింది. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడం సబబే అయినప్పుడు, ఇతరులు ఇక్కడికొస్తే తప్పేముంది. ప్రజలు ఇప్పుడు సుపరిపాలన కోరుకుంటున్నారు. బీజేపీ అదే దిశగా పనిచేస్తోంది.
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లవి సెంటిమెంట్ డ్రామాలని, తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన చెప్పా రు. కేటీఆర్ తనతో వస్తే బీజేపీ అభివృద్ధి చేసిన రాష్ట్రాలను చూపిస్తానని రాంచందర్ రావు ప్రతిసవాల్ విసిరారు. జనసేనతో ఎన్నికల్లో పొత్తు అంశం జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
సీబీఐతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ ఇంటికి మోదీ వెళ్తే వారి గుండెల్లో రైళ్లు పరు గెడుతున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. తెలంగాణ కృష్ణా జలాల వాటాను రాజకీయ ప్రయోజనాల కోసం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు రాసిచ్చారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలోఎంఐఎం భాగస్వామ్యం లేదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే చేసే ఆలోచన ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి దుష్ప్రచారాల వెనుక అర్బన్ నక్సల్స్ శక్తులున్నాయని తెలిపారు.
ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ త్వనే అజెండాగా తీసుకోదని, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమకు మద్దతిచ్చే శక్తులను తిరస్కరించబోమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘12 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షల సాధన-భవిష్యత్ ప్రయాణం’ అనే అంశంపై నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రాంచందర్ రావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర..
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్రను ఎవరూ విస్మరించలేరని, అది చరిత్రలో నమోదైన సత్యమని రాంచందర్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగా ణ బిల్లుకు బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు ఇచ్చిందని నొక్కిచెప్పారు. తెలంగాణ విషయంలో ఆంధ్ర బీజేపీ నాయకులు కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారన్నారు. ఇక, తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కావాలంటే.. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు వద్దని ఆందోళన చేశారన్నారు.
బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే ఘటనతో పార్లమెంట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా, బీజేపీ తన మద్దతును వెనక్కి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత కీలకమైన ఆ సమయంలో టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) ఎంపీలు సభలోనే లేరన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ బి ల్లు రూపకల్పన, సవరణల ప్రక్రియలో తాను ప్రత్యక్షంగా భాగస్వామినయ్యానని రాంచంద ర్ రావు వెల్లడించారు.
తాను స్వయంగా తెలంగాణ బిల్లు కాపీతో ఢిల్లీకి వెళ్లి, సీనియర్ న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలతో కలిసి అరుణ్ జైట్లీని, బీజేపీ జాతీయ నాయకులను కలిసి బిల్లును పూర్తిగా అధ్యయనం చేసి వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండ టం కోసం తామంతా కలిసి రాత్రంతా కూర్చు ని చర్చించిన సందర్భాలు ఉన్నాయని, బిల్లు పార్లమెంట్‌కు వెళ్లే ముందు జరిగిన కీలక సంప్రదింపుల్లోనూ, ఢిల్లీలో సమన్వయం చేయడంలో భాగస్వామ్యమయ్యారని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం 1,200 మందికి పైగా విద్యార్థులు, అమాయక యువకుల బలిదానాల ఫలితమని, వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలే మన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క పార్టీదో కాదని.. జేఏసీలు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, సకల జనుల సమిష్టి పోరాటమని స్పష్టం చేశారు.
ఈ ఘనతను ఏదో ఒక పార్టీకి మాత్రమే ఆపాదించాలని చూడటం చరిత్రను వక్రీకరించ డమే అవుతుందన్నారు. నాడు జేఏసీలో తామున్నా మని, కాంగ్రెస్ లేదన్నారు. రాష్ట్రం వచ్చినా ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం పూర్తిగా లభించకపోవడం దారుణమన్నారు.
గోదావరి జలాలపై పాలసీ ఏదీ?
నీళ్లు, నిధులు, నియామకాల అంశాల్లో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వాలు రాజీ ధోరణి అవలంబించి, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టాయని విమర్శించారు.
గోదావరి జలాల వినియోగంలో కూడా స్పష్టమైన పాలసీ లేదని, ప్రాజెక్టుల నమూనాలు మారుస్తూ గందరగోళం సృష్టించారన్నారు. ఒకే ఒక్క ప్రాజెక్టుపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని, తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నియామకాలేవి?
నియామకాల విషయంలో బీఆర్‌ఎస్ దారుణంగా విఫలమైతే, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు యువతను వంచించాయని, నేడు గ్రూప్-1 పరీక్షల వివాదాలే ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కంటే కోర్టుల చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారన్నారు. అలాగే, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి అధ్యాపకుల శాశ్వత నియామకాలు చేపట్టకుండా, కేవలం అడ్హాక్, పార్ట్‌టైప్ ఫ్యాకల్టీలతో నడపడం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిలు కోసం ఎదరుచూపులు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తంచేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా 1వ తేదీన చెల్లించడానికి క్యాబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందంటే.. ఇప్పటివరకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల కోసం, కాంట్రాక్టర్లు రూ. 20 వేల కోట్ల బకాయిల కోసం, విద్యార్థులు రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కృష్ణా జలాల వాటాను కర్ణాటకకు రాసిచ్చారు..
తెలంగాణ కృష్ణా జలాల వాటాను సీఎం... కర్టాటక సీఎం డీకే శివకుమార్‌కు రాసిచ్చారని ఆరోపించారు. రాయ్‌చూర్ దగ్గర ప్రాజెక్టు కోసం తెలంగాణ వాటా నీళ్లను ఆ రాష్ట్ర సీఎం కు గిఫ్ట్‌గా ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా ఇతర రాష్ట్రాలకు మళ్లే పరిస్థితిని ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయన్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసం తెలంగాణ జల హక్కులను తాకట్టు పెడుతున్నారన్నారు.
అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడాన్ని తాము వ్యతిరేకించమని, ప్రజా ప్రయోజనాల కోసం బీజేపీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పీఎంను పది సార్లు కలుస్తున్నప్పుడు పక్క రాష్ట్రం సీఎం ను రేవంత్ ఎందుకు కలవలేరని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ మొదటి నుంచి ఒకే వైఖరితో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బ్యారేజీలకే విచారణను పరిమితం చేస్తే పూర్తి నిజాలు బయటకు రావని, చిత్తశుద్ధి ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పోరాటంతోనే ప్రభుత్వంలో కదలిక..
ధాన్యం కొనుగోలు చేయడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, సేకరణలో తాత్సారం చేసి కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకు లు రైతుల వద్దకు వెళ్లి పోరాడిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, లేదంటే ప్రభుత్వం ఇంకా నిద్రపోయేదని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ పడాలే తప్ప, వైరం పెంచుకోకూడదన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే ఆలోచనలో ఉందని, అయితే పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటుందని చెప్పారు. తమకు మద్దతు ఇచ్చే శక్తులను ఎప్పుడూ తిరస్కరించబోమన్నారు.
పవన్ సభకు అనుమతినిస్తే గొడవే ఉండేది కాదు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వని అంశాన్ని కొందరు అనవసర వివాదం చేస్తున్నారన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని, పవన్ కళ్యాణ్‌కి అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. అనుమతి ఇచ్చి ఉంటే కథ అక్కడే ముగిసేదని, ఆ తప్పును బీజేపీపై రుద్దాలని చూడటం రాజకీయ దివాళాకోరుతనమన్నారు.
నరేంద్రమోదీ... చంద్రబాబు నాయు డు, పవన్‌కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిస్తేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు.
వాళ్లు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడం సబబే అయినప్పుడు, ఇతరులు ఇక్కడకు వస్తే అభ్యంతరాలు చెప్పడం వారి అవకాశవాదానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అభివృద్ధి, పనితీరుపై ఉండాలి కానీ, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలు ఇప్పుడు సెంటిమెంట్‌ను కాకుండా ఉపాధి, పెట్టుబడులు, సుపరిపాలన కోరుకుంటున్నారని, బీజేపీ అదే దిశగా పనిచేస్తోందని చెప్పారు.
తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు..
గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 13 లక్షల కోట్ల మేర ఆర్థిక సహకారం అందించిందని ఆయన వెల్లడించారు. జాతీయ రహదారులకు తాజాగా 7,597 కోట్లతో దాదాపు 190 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణలోని మొత్తం 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నారు.
ములుగులో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణతో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు కీలక చర్యలు చేపట్టామని, వరంగల్లో టెక్స్‌టైల్ మిత్ర పార్క్’ ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుందని, జహీరాబాద్‌ను జాతీయ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3,000 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. శంషాబాద్ పరిసరాల్లో ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రం భారీ ప్రోత్సాహం ఇస్తోందన్నారు.
కాక్రోచ్ పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్..
సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’ లాంటి దుష్ప్రచారాల వెనుక అర్బన్ నక్సల్స్ శక్తులు పనిచేస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. యువతను హింస, అరాచకం వైపు మళ్లించే శక్తులను, దేశంలో గందరగోళం సృష్టించే శక్తులను బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఇటువంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారని, జార్జ్ సోరోస్ వంటి విదేశీ శక్తుల నిధులతో దేశ వ్యతిరేక ప్రచారాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.
ఫస్ట్రేషన్‌లో ఉన్న నాయకులు కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయని, ప్రశాంత్ కిషోర్ వంటి వారి వ్యాఖ్యలు కూడా రాజకీయ అసంతృప్తి ఫలితమేనన్నారు. ఎస్‌ఐఆర్ అనేది కేంద్ర ప్రభుత్వానిదో లేదా బీజేపీదో కాదని.. అది భారత ఎన్నికల సంఘం చేపట్టే స్వతంత్ర ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో కూడా దేశంలో 10 సార్లు ఈ ప్రక్రియ జరిగిందన్నారు. 2002లో జరిగిన సమగ్ర ప్రక్షాళన తర్వాత, ప్రస్తుతం 2025- ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహిస్తోందని, దీనికి రాజకీయ రంగు పూయడం తగదన్నారు.
దక్షిణ భారతంలోనూ ప్రజాదరణ..
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్డీఏ విజయవంతంగా సాగుతోందని, రానున్న రోజుల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్రిపుర, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో ఏ విధంగానైతే సంస్థాగతంగా బలపడి విజయాలు సాధించామో, తెలంగాణలోనూ అదే పునరావృతం చేస్తామన్నారు.
ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలపై నిరంతరం పోరాడటమే బీజేపీ సిద్ధాంతమని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని రాంచందర్ రావు స్పష్టంచేశారు. ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ కంటే బీజేపీ బలంగా ఉందని, దక్షిణ తెలంగాణలోనూ పుంజుకుంటుందన్నారు. రానున్న రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం చేస్తాన్నారు.
బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు చెరోసారి అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలని భావిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ప్రత్యేక హౌసింగ్, సంక్షేమ పథకాలను ప్రాధాన్యతగా అమలుచేస్తామని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లాగా జర్నలిస్టులను వంచించబోమని రాంచందర్ రావుహామీ ఇచ్చారు.
సెంటిమెంట్ రాజకీయం..
ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమా జం అంశాన్నే అజెండాగా తీసుకోదని.. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, హామీల అమలులో విఫలమైనందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు వారి వైఫ ల్యాల ఆధారంగానే వారిని తిరస్కరిస్తున్నారని, ఆ భయంతోనే లేనిపోని భావోద్వేగాలను ముందుకు తెస్తున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎంఐఎం భాగస్వామి కాదనే విషయం అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదని రాంచందర్‌రావు విమర్శించారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమలో చేర్చుకుని పదవులు ఇచ్చాయన్నారు. తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు తెలంగాణ పేరుతో రాజకీయం చేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి పరాకాష్ట అని విమర్శించారు.
నాతో వస్తే అభివృద్ధి చూపిస్తా..
బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిపై కేటీఆర్ చేసిన విమర్శలను రాంచందర్ రావు తిప్పికొట్టారు. కేటీఆర్‌కు నిజంగా తన ఛాలెంజ్‌పై సీరియస్‌నెస్ ఉంటే.. తనతో కలిసి రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలకు రావాలి, అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో తాను ప్రత్యక్షంగా చూపి స్తానన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన వారి పాలనకు, బీజేపీ పాలనకూ ఉన్న తేడా ప్రజలకే తెలుస్తుం ది అని సవాల్ విసిరారు.
బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేంద ర్ సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ అత్యంత బలంగా ఉందన్నారు. తెలంగాణను లేదా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి వ్యాఖ్యలనైనా (పవన్ కళ్యాణ్, మంత్రి పొన్నం చేసిన అయ్య జాగిరా అనే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నారో తనకు తెలియదన్నారు.






