శిథిలావస్థలో ఐబీ భవనం..
పక్కనే అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు పొంచి ఉన్న ప్రమాదం
గంభీరావుపేట జులై 22(విజయక్రాంతి )గంభీరావుపేట మండలం నర్మాల మానేరు క్యాంపులో ఉన్న ఐబీ (ఇన్స్పెక్షన్ బంగ్లా) భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదానికి కారణమవుతోంది. దాదాపు 30 సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఈ భవనం కూలిపోయే స్థితికి చేరిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేకంగా, ఈ భవనం పక్కనే అంగన్వాడి కేంద్రం ఉండటం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.
చిన్నారులు ఆడుతూ పాడుతూ ఆ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే భయం నెలకొంది.స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగే ముందు ముందస్తు చర్యలు తీసుకుని, శిథిలావస్థలో ఉన్న ఐబీ భవనాన్ని వెంటనే తొలగించాలని చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
భవనాన్ని తొలగించాలి
ఏళ్లుగా భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరింది. పక్కనే అంగన్వాడి కేంద్రం కూడా ఉంది.ప్రమాదం జరగకముందే శిథిలావస్థకు చేరిన ఇరిగేషన్ భవనాన్ని అధికారులు వెంటనే తొలగించాలి.
రాజబోయిన అర్చన, సర్పంచ్, నర్మాల






