గడ్డిపల్లి వద్ద రహదారిపై భారీ గుంతలు
గరిడేపల్లి, జూన్ 23 : మండలంలోని గడ్డిపల్లి గ్రామ పరిధిలో సూర్యాపేట గరిడేపల్లి ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఓ టిప్పర్ వాహనం భారీ గుంతలో ఇరుక్కుపోవడంతో సుమారు గంటన్నరపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రహదారిపై వాహనాలు బా రులు తీరగా, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
రహదారిపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం చూపకుండా కేవలం కంకర, మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులతో ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంతలు మరింత ప్రమాదకరంగా మారాయని, తరచూ చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.






