రైతుల సంక్షేమమే సర్కార్ ధ్యేయం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూన్ 2౩ (విజయ క్రాంతి): రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ (శ్రీరాముల పల్లి ) రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున వారి ధాన్యం, మొక్కజొన్న దిగుబడి వచ్చిందని అన్నారు.
అధికారుల సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేసినట్లు వివరించారు. కొనుగోలు చేసిన నాలుగు ఐదు రోజుల లోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వానాకాలం సీజన్ లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు మాత్రమే రైతులు సాగు చేయాలని మంత్రి కోరారు. గొల్లపల్లి మండలం శ్రీరాములు పల్లి గ్రామంలో 70 లక్షలతో ప్రమాదకరం గా ఉన్న కరెంట్ వైర్లు తొలగించినట్లు మంత్రి వివరించారు.
గ్రామంలో ఐకేపీ సెంటర్ తో పాటు గ్రౌండ్ ప్రతిపాదనలు వచ్చాయని గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు సంఘ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్‌ఎం-1638, కేఎన్‌ఎం-7715 తదితర నాణ్యమైన వరి విత్తనాలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈనెల 23 నుంచి 31 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






