బిల్లు కట్టమంటే.. కత్తులతో దాడి
సరూర్ నగర్ లోని అర్బన్ రెస్టారెంట్
సిబ్బందిపై దాడి చేసిన రౌడీ షిటర్లు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఎల్బీనగర్, మే 6 : రెస్టారెంట్ కు వచ్చి తిన్న వాటికి బిల్లు కట్టమని అడిగితే నిర్వాహకులు, సిబ్బందిపై రౌడీ షిటర్లు కత్తులు, కర్రలతో దాడి చేసిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు, అయితే, పోలీసుల సమక్షంలోనే రౌడీ షిటర్లు తమపై దాడి చేశారని సిబ్బంది ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే... సరూర్ నగర్ లోని అర్బన్ రెస్టారెంట్ కు ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో నేరచరిత్ర ఉన్న ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి తమ అనుచరులతో కలిసి వచ్చి, నచ్చినవి తిన్నారు. అనంతరం తిన్న వాటికి బిల్లు చెల్లించాలని రెస్టారెంట్ సిబ్బంది బిల్లు అందజేశారు.
తమనే బిల్లు అడుగుతారా? అని నిర్వాహకులు, సిబ్బందిపై ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి సరూర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చినా దాడి జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల్లో నేరచరిత్ర ఉన్న ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని సమాచారం. గతంలో వనస్థలిపురంలో జరిగిన హత్య కేసులో ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి నిందితులు. ఏదుల ప్రసన్ రెడ్డి ఉన్నత అధికారుల పేర్లు చెప్పుకొని బార్లు, రెస్టారెంట్లలో నయా దందా సాగిస్తున్నట్టు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.






