ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం
- ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
- కారు అతివేగమే కారణం?
శంషాబాద్/సిరిసిల్ల, మే 1 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమా దం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులైన బొల్లి శివకుమార్, బొల్లి లావణ్య, బొల్లి రిషిత, కొడెం శ్రీనివాస్, కృష్ణ చంద్ర, శ్వేత, కోడెం మాధవ్ హైదరాబాద్‌లోని సనత్ నగర్ ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో నివసిస్తున్నారు.
క్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్-16 (తొండుపల్లి) వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల కారు అదు పు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. బొబ్బిలి శివకుమార్, బొల్లి లావణ్య, బొల్లి రిషిత, కొడెం శ్రీనివాస్, కృష్ణ చంద్ర, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. కోడెం మాధవ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోవడంతో, పోలీసులు యంత్రాల సహాయంతో వాటిని అతికష్టం మీద బయటకు తీశారు.
ఈ ఘోర ప్రమాదంపై సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు. శంషాబాద్ ఏసీపీ నాగభూషణంతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ‘ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామ మైన సిరిసిల్ల జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గురైన కారు బొల్లి శివకుమార్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో కారు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి ప్రధా న కారణమని తెలుస్తోంది. ఈ కారుపై ఇప్పటికే రెండు ’ఓవర్ స్పీడ్’ చలాన్లు పెండిం గులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బాధితులకు అండగా ఉంటాం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ముఖ్యంగా సిరిసిల్ల బీఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్ వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణంతో స్వయంగా మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించేలా తన బృందాన్ని కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించమ న్నారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలచివేసిం దని, మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో తోడుంటామని ఆయన స్పష్టం చేశారు.






