హోలీ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, మార్చి 2 (విజయక్రాంతి): రంగుల పండుగ హోలీని సౌహార్దానికి, సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో కోరారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడాలని, ఇతరుల అనుమతి లేకుండా వారిపై రంగులు లేదా నీరు చల్లడం నేరమని పేర్కొన్నారు.
మహిళలు, వృద్ధులు, పిల్లల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, బలవంతంగా రంగులు పూసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, మోటార్ సైకిళ్లపై ట్రిపుల్ రైడింగ్, మితిమీరిన వేగం, స్టంట్లు చేసే వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. హోలీ సాకుతో ఈవ్-టీజింగ్, మహిళలను వేధించే వారిపై నిఘా ఉంచడానికి ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించామని తెలిపారు.
అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని, నిర్ణీత శబ్ద పరిమితులను మించరాదని, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినా, మతపరమైన ఉద్రిక్తతలు పెంచే పోస్టులు పెట్టినా ఐటీ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించబడతారని తెలిపారు. హోలీ కార్యక్రమాలు నిర్వహించే వారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ముందస్తు అనుమతి పొందాలని, వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అత్యవసర సహాయం కావాలన్నా వెంటనే ’డయల్ 100’ కు కాల్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కమిషనర్ కోరారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి సురక్షితమైన హోలీ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.




