26 July, 2026 | 3:15 AM

ప్రతి కథా ఒకేలా ఉంటే చరిత్రకూ నచ్చదు.. మాది కొత్త ప్రేమకథ

26-07-2026 12:00 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “స్టీవెన్ శంకర్ రోల్ స్క్రిప్ట్ విన్నప్పుడు నాలో కొంత సందేహం ఉండేది. హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సినిమా చేయడం కరెక్టేనా అనిపించేది.

ఇంత ఇన్నోసెంట్‌గా, ఎమోషనల్‌గా నటించి మెప్పించగలనా అనిపించేది. ప్రతి ప్రేమకథ ఒకేలా ఉంటే చరిత్రకూ నచ్చదు. మాది కొత్త ప్రేమ కథ. ప్రేక్షకులు మా సినిమా మీద చూపిస్తున్న ప్రేమకు, నా మాట మీద చూపించిన నమ్మకానికి కృతజ్ఞతలు” అన్నారు. శ్రీగౌరిప్రియ మాట్లాడుతూ.. “పెద్దలు, యువత, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ మా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. హాల్ చూస్తే ప్రేక్షకులందరినీ ఒక్కటి చేసేది మంచి సినిమా అనిపించింది” అని చెప్పారు.

సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “ఒక మంచి సినిమాకు ప్రకృతి అంతా సహకరిస్తుందని నేను నమ్ముతా. ఈ సినిమా విషయంలో అది మరోసారి నాకు అనుభవం అయింది. బేబి సినిమా తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమానే చేయాలని అనుకున్నాం. బేబి కంటే చాలా గొప్ప సినిమా చేశాం” అన్నారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “బాలచందర్, భారతీరాజా కథల్లా సాయి రాజేశ్ కథల్లో బలం ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ డే 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నా.

కిరణ్ బ్యాంకబుల్ హీరోగా, పర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజంగా ఆయన ఒరిజినల్ స్టార్. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎంత బలంగా ఉంటుందని చెప్పడమే కల్ట్. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్లినా మళ్లీ తిరిగి వస్తాడది క్లాసిక్. మా ట్యాగ్‌పై ఉన్న నమ్మకాన్ని మా చెన్నై లవ్ స్టోరీ నిలబెట్టింది. ఆ సంతృప్తి మాకు చాలు” అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ.. “మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా కల నిజమైన సంతోషం కలుగుతుంది. నేనూ అలాంటి హ్యాపీనెస్‌నే ఎంజాయ్ చేస్తున్నా” అని తెలిపారు. కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, డీవోపీ విశ్వాస్ డేనియల్, హీరో త్రిగుణ్, నటీనటులు మహేందర్, ప్రమోదిని, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.