3 April, 2026 | 4:30 AM

చారగొండలో చారిత్రక శిల్పాలు

03-04-2026 12:34 AM

మూడు అరుదైన శిల్పాలను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన చారగొండ గ్రామంలో శివాలయం పరిసరాల్లోని మూడు అరుదైన శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడ్ గుర్తించారు.  

రాజకవి శిల్పం

ఒకటవది రాజకవి శిల్పం. అర్ధపద్మాసనంలో కూర్చున్న రాజు కుడిచేతపట్టిన ఖడ్గం మొనను ఎడమపాదం మీద విశ్రాంతంగా ఆనించాడు. ఎడమచేత పుస్తకం ధరించాడు. నడినెత్తిసిగ మణిపట్టికతో అలంకరించబడ్డ ది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. మెడ లో హారాలున్నాయి. భుజంమీద జంధ్యం ఉంది. నడుమున ధట్టీ వుంది. దండరెట్టలకు  పూసలదండలున్నాయి. చేతులకు కంకణాలున్నాయి. వేష, భూషణాదులన్నీ రాజహో దావే. ఈ శిల్పం రాష్ట్రకూటశైలికి చెందిన రాజపండితగల్లు శిల్పం. గతంలో ఇదే జిల్లా లో ‘పండితగల్లు’ శిల్పాలు రెండు లభించా యి. ఈ శిల్పం వాటికంటె విభిన్నమైంది.

భైరవుడు

రెండవది భైరవ శిల్పం. జ్వాలాకేశాలతో కపాలమకుటం ధరించాడు. సర్ప కుండలా లు, సర్పాలే హస్తభూషణాలు, సర్పహారం, కపాలమాల, కపాలమేఖలతో, కాళ్ల కు కడియాలతో, పాంజీబులతో, త్రిభంగిమ లో వైతస్తికపాదాలతో చతుర్భుజ భైరవు డు పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలతో, నిజహస్తాల్లో ఖడ్గం, రక్తపాత్రలతో పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలతో,నిజస్తాల్లో ఖడ్గం, రక్తపాత్రలతో స్థానక శిల్పంగా కనిపిస్తున్నా డు. అతనికి రెండువైపుల బేతాళులు ఒకరు నాట్యం చేస్తుండగా, మరోకరు కూర్చుని రక్తంకోసం చేతులు చాపుతున్నాడు. ఈ భైరవుడు తాంత్రిక మూర్తి. శైలి లోకాకతీయ శిల్పం.

సప్తమాతృకలు

దేవాలయ ప్రాంగణంలో సప్తమాతృకల ను చెక్కిన రాతిదిమ్మె ఉంది. పూర్వం నుంచి ఉన్న మాతృకల క్రమం కాకుండా ఈ శిల్పపట్టికలో యమి, బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, చాముండ దేవతలున్నా రు. ఏడుగురు అమ్మదేవతల వరుసలో ఉం డాల్సిన వారాహి లేదు. అందరు దేవతలకన్న ముందుస్థానానికి చేరింది యమి. ఇది ఆధునికం అంటే 14,15వ శతాబ్దాలకు చెంది న శిల్పం. ఈ తర్వాత సప్తమాతృకల క్రమం లో చేర్పులు, మార్పులు లేవని శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం తెలిపారు.