1 March, 2026 | 3:24 AM

హిందువుల చూపు.. శ్రీధర్‌బాబు వైపు

01-03-2026 01:24 AM

శారదాపీఠం భూముల వివాదంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం 

  1. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో పీఠానికి భూముల కొనసాగింపు 
  2. ఆలయం కూల్చివేత ప్రయత్నంపై హిందూ సమాజంలో ఆగ్రహం 
  3. పీఠానికి కేటాయించిన భూమిని జలమండలికి అప్పగించడంతో వివాదం 
  4. తప్పుదోవ పట్టించిన అధికారుల తీరుపై సీఎం సీరియస్ 
  5. రాష్ట్రంలోని అన్ని ఆలయాలపై దృష్టి సారించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు హిందువుల విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఆధ్యాత్మిక సంస్థల భూముల రక్షణ అంశం మరోసారి రాజకీయ, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీ శారదాపీఠానికి గతంలో అధికారికంగా కేటాయించిన భూమి ని ప్రస్తుత ప్రభుత్వం జలమండలికి కేటాయి స్తూ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. ఈ భూమిలో ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఆలయాన్ని తొలగించేందు కు అధికారులు ప్రయత్నించిన సమాచారం వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా హిందూ సమాజం భగ్గుమంది.

ఈ పరిణామాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో శారదాపీఠాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్‌రావు కూల్చివేతలను వెంటనే ఆపేవిధం గా చూడాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వయంగా జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు మంత్రి శ్రీధర్‌బాబుపై హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఆశలు పెట్టుకున్నాయి.

కేసీఆర్ హయాంలో..

శారదాపీఠం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తరించేందుకు గతంలో ప్రభుత్వం అధికారికంగా భూమి కేటాయించింది. అప్పటి సీఎం కేసీఆర్ హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి విజ్ఞప్తిమేరకు సుమారు రెండు ఎకరాల భూమి ని పీఠానికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపు తర్వాత పీఠం అక్కడ ఆలయ నిర్మాణం చేపట్టి, పూజా కార్యక్రమాలు ప్రారంభించింది.

భక్తులు కూడా అక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ, ఆ ప్రదేశం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. అయితే ఇటీవల అధికారులు ఈ భూమిని తిరిగి ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (జలమండలి) అవసరాల కోసం కేటాయించే చర్యలు ప్రారంభించారు. భూ మి కేటాయింపు మార్పు నేపథ్యంలో అక్కడ ఉన్న ఆలయ నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం బయటకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని అకస్మాత్తుగా ప్రభుత్వ అవసరాల పేరుతో స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఆలయాన్ని తొలగించే ప్రయత్నం హిందూ భావోద్వేగాలను దెబ్బతీసిందని, ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎ త్తున చర్చ ప్రారంభమైంది. వివిధ హిందూ సంఘాలు, ధార్మిక నాయకులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

మంత్రి శ్రీధర్‌బాబు రంగంలోకి..

వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యం లో మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించినట్లు తెలిసింది. హిందూ సంఘాల ప్రతిని ధులు ఆయనను కలిసి పరిస్థితిని వివరించడంతో మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. భూమి కేటాయింపు చరిత్ర, గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుతం జరుగుతున్న చర్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశిం చినట్లు తెలిసింది. మంత్రి జోక్యంతో జలమం డలికి భూమి కేటాయింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో పీఠానికే భూములను కొనసాగించాలని , ఆలయంపై ఎలాంటి చర్యలు తీసుకోకుం డా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి జోక్యంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం హిందూ సంఘాల్లో ఊరటనిచ్చింది. ఈ వ్యవహారాన్ని మంత్రి శ్రీధర్‌బా బు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిన తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.

గతంలో అధికారికంగా కేటాయించిన భూమిని సరైన పరిశీలన లేకుండా తిరిగి కేటాయించేందుకు ఎలా చర్యలు తీసుకున్నారని అధికారులను సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా అధికారులు వ్యవహరించారా అనే కోణంలో కూ డా విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

శారద పీఠం భూములు కొనసాగింపు

కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూ ములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు.

కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై మండిపడ్డారు. జల మండ లికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.

మంత్రి పాత్రపై ప్రశంసలు...

శారదాపీఠం భూముల వివాదం తాత్కాలికంగా పరిష్కారమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తం గా ఆధ్యాత్మిక సంస్థల భూములపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హిందూ సం ఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానం రూపొందించాలని, ఇప్పటికే కేటాయించిన భూముల రక్షణకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక సంస్థల భూములపై సమగ్ర సమీక్ష చేపట్టాలని కోరుతున్నాయి.

శారదాపీఠం భూముల వివాదంలో మంత్రి శ్రీధర్‌బాబు తక్షణ స్పందన కీలకంగా మారిందని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. సమస్య మరింత పెద్దదిగా మారకముందే మంత్రి జోక్యం చేసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఆధ్యాత్మిక వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఆధ్యాత్మిక సంస్థల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని వారు కోరుతున్నారు.

శారదాపీఠం భూముల వివాదం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక సంస్థల భూముల రక్షణపై పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనతో ప్రభుత్వం, అధికారులు భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో శారదాపీఠం భూముల వివాదం తాత్కాలికంగా ముగిసినా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక సంస్థల భూముల రక్షణపై ఆయన తీసుకునే చర్యలపైనే హిందూ సమాజం ఆశలు పెట్టుకుంది.