ప్రకృతి వ్యవసాయంతోనే అధిక దిగుబడి
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, నానో యూరియాను వినియోగించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆవు పేడ, మూత్రంతో చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుందని తెలిపారు.
‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకంపై రైతు శిక్షణ, ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు శాస్త్రవేత్త లు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ప్రకృ తి సాగు ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం రైతులకు ఉచితంగా కూరగాయల విత్త న, ఇతర కిట్లను కలెక్టర్ పంపిణీ చేసి తేనెటీగల పెంపకం వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ... రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 21,000 విత్తన కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో కిట్ విలువ సుమారు రూ. 500 ఉంటుందని తెలిపారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు.
భూమి లేని వారు తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు కోల్ స్టోరేజ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నాబార్డ్, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా 35% నుండి 45% వరకు సబ్సిడీ లభిస్తుందని, ఇందుకోసం రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లుగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. రైతులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 14416 కి కాల్ చేయాలని సూచించారు.
వినాయక్ చౌక్‌లోని రైతుబజార్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు కోరగా, కమిటి ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, శాస్త్రవేత్త మల్లేష్, ఉద్యానవన అధికారులు అలేఖ్య, క్రాంతి కుమార్, ఏవో అష్రఫ్, రైతు సంఘం నాయకులు గోవర్ధన్ యాదవ్, రైతులు, ఇతర ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.




