20 March, 2026 | 8:39 AM

బడ్జెట్‌పైనే గంపెడాశలు

20-03-2026 12:00 AM
  1. నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ 

మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులు జరిగేనా? 

నిధులు లేక కుంటుపడుతున్న బల్దియాల అభివృద్ధి 

మూడు కార్పొరేషన్లుగా విభజించి వదిలేసిన సర్కారు 

సమస్యలతో సతమతమవుతున్న నగరవాసులు 

మేడ్చల్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్ పై నగరవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. జిహెచ్‌ఎంసిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా వదిలేసింది. దీం తో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు దురుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిహెచ్‌ఎంసికి 4000 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. రోడ్లు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ బడ్జెట్ లో మూడు కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. 

సమస్యలతో సతమతం..

రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను మొదట జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు, నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ లో జిహెచ్‌ఎంసిలో విలీనమయ్యాయి. డివిజన్ల పునర్విభజన కూడా జరిగింది. 12 జోన్లు, 60 సర్కిల్, 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఆ తర్వా త ప్రభుత్వం గత నెలలో జిహెచ్‌ఎంసిని మూడు ముక్కలు చేసింది.

జిహెచ్‌ఎంసి, మల్కాజిగిరి, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని డివిజన్ లను మల్కాజిగిరి, మరికొన్ని డివిజన్లను సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. ఒక్కో సర్కిల్ కార్యాలయంలో నాలుగు ఐదు డివిజన్లు ఉన్నా యి. సర్కిల్ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. ముఖ్యంగా విలీన మున్సిపాలిటీలలో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్లు అద్వాన్నంగా తయారయ్యా యి. గుంతలు పుడ్చే పరిస్థితిలో కూడా సర్కిల్ కార్యాలయాలు లేవు. డ్రైనేజీ లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లమీద మురుగునీరు ప్రవహిస్తోంది. దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల నీటి సమ స్య తీవ్రంగా ఉంది. నీటి కోసం ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. నీటి సమస్య వల్ల ట్యాంకర్ లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల ధర పెంచేశారు. 

ఎమ్మెల్యేలు గళమెత్తాలి..

మేడ్చల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఐదు నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన సం దర్భాలు చాలా తక్కువ. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎంత నిధులు అవసరం,

ప్రభుత్వం ఎంత కేటాయించింది, సరిపోతాయో లేదో పరిశీలించి నిధుల కోసం గళ మెత్తాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విభజన బిల్లును ప్రవేశపెట్టిన అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.