కీసరగుట్టపై హెరిటేజ్ వాక్
పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు
మేడ్చల్, మే 20 (విజయక్రాంతి): ప్రముఖ దైవ క్షేత్రంగా వెలుగొందుతున్న కీసరగుట్టపై బుధవారం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలలో హెరిటేజ్ వాక్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కీసరగుట్టను టూరిజం శాఖ ఎంపిక చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు కీసరగుట్ట నంది విగ్రహం వద్ద ప్రారంభమై ఆలయం పైభాగం వరకు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి & జిల్లా పర్యాటకం అధికారి (ఇంచార్జ్) ఐ. విజయ కుమారి, ఎల్డీఎం శివప్రసాద్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాధిక పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కోలాటం కళాకారులు, సైక్లింగ్, క్రీడలకు సంబంధించిన విద్యార్థులు, స్థానిక యువత, ఆలయ పురోహితులు, ఉపాధ్యాయులు, ఎంపీఓలు, స్పోరట్స్ బీపీటీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి తరలివచ్చి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారన్నారు. భక్తులకు అవసరమైన వసతులను కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉందన్నారు. ప్రతి బ్రహ్మోత్సవానికి, గతంలో చేసిన దానికంటే కొత్తగా, ఏదో ఒక మెరుగుదల చూపించాలన్నారు.
దేశ, విదేశాలలో కీసరగుట్టపై ఎంతో భక్తిభావం ఉన్న దాతలు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే వారి విరాళాల ద్వారా ఆలయానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రభుత్వం తరపున మరియు దాతల సహకారంతో నిధులను మరింత సేకరించి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చన్నారు. పర్యాటక అభివృద్ధికి అవసరమైన అంశాలను టెంపుల్ ఈవో ప్రతిపాదిస్తే, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా స్థాయిలో కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ‘కీసరగుట్ట ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతమని, నేను కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రాంత విశిష్టతను ఎండోమెంట్ శాఖ ద్వారా తెలుసుకున్నానని, ఈ ప్రాంత అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాము‘ అని తెలిపారు.






