మహిమాన్విత క్షేత్రం హేమాచలం
ప్రకృతి అందాల నడుమ పుణ్యక్షేత్రం
ఎన్.మాధవ్, మంగపేట, విజయక్రాంతి: రాష్ట్రంలో రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రకృ తి అందాల నడుమ ఆధ్యాత్మికతకు నిలయమై అటు భక్తులను, ఇటు పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో హేమాచల క్షేత్రం (మల్లూరు గుట్ట)పై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తున్నది.
సహజ సిద్ధంగా ఉన్న చింతామణి జలపాతం, కొండపై ఉన్న అటవీ వృక్ష సంపద అందాలు, బండరాళ్లతో ఉన్న ఆలయ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల మనసులు దోచుకుంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
శాతవాహన వంశానికి చెందిన దిలీప్ కర్ణి పరిపాలనలో ఈ ఆలయం బయటపడిందని చరిత్ర, స్థానికుల ద్వారా తెలుస్తుంది. రావణుడు ఈ కొండను తన సోదరి శూర్పణకకు బహుమతిగా ఇచ్చాడని, అర్ధ చంద్రాకారంలో ఉన్న ఈ కొం డకు అగస్త్య మహర్షిహేమాచల అని పేరు పెట్టారని చెబుతారు. ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం నిత్యం (365 రోజులు) ఒకే రీతిన పారుతుండడం హేమాచల క్షేత్రం ప్రత్యేకత. కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి ఈ జలధారకు చింతామణి అని పేరు పెట్టారని చెబుతారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక రకాల వృక్షాలు మొదళ్ల (వేర్లు) నుంచి చింతామణి జలధార ప్రవహిస్తుండడంతో చింతామణి జలం సేవిస్తే పలు రోగాలు తగ్గుతాయని భక్తులకు అపార నమ్మకం. హేమాచల క్షేత్ర పరిసర ప్రాం తాల్లో వేలాది రకాల ఆయుర్వేద వనమూలికలు, వృక్షాలు ఉన్నాయని గుర్తించిన అటవీ శాఖ హేమాచల క్షేత్రంపై గతంలో మెడిసినల్ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేసింది.
స్వయంభూగా వెలసిన శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ 9.4 అడుగుల ఎత్తులో ఉంటుంది. నరసింహస్వామి ఉగ్ర రూపంలో సింహ ముఖం కలిగిన మానవ శరీరంతో ఏకశిలా విగ్రహంతో ఈ మూల విరాట్ విగ్ర హం ఉంటుంది. శ్రీహేమాచల లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతీ శని, ఆది, సోమవారాల్లో నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
నాభి చందనం ప్రత్యేకత
శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి నాభి చందనకు ప్రత్యేక చరిత్ర ఉంది. శాతవాహన వంశానికి చెందిన దిలీప్ కర్ణి మహారాజుకు స్వామివారు కలలో సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని తెలపడంతో మహారాజు సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి నాభి ప్రదేశంలో (బొడ్డు వద్ద) గునపం గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది.
స్వామి వారి నాభి వద్ద నుంచి వెలువడే ద్రవాన్నే నాభి చందనంగా పిలుస్తారు. స్వామి వారికి తిల తైలాభిషేకం నిర్వహిం చి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారి నాభి ప్రదేశం నుం చి వచ్చే ద్రవాన్ని (నాభి చందనాన్ని) ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, రోగాలు నయం అవుతాయని, దోషాలు తొలుగుతాయని భక్తుల అపార నమ్మకం.
క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి
శ్రీహేమాచల క్షేత్రానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకు డు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో గుట్టకు కుడి పక్కన సుమారు అర కిలోమీటరు దూరంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. శిఖాంజనేయ స్వామి రూపంలో 7.6 అడుగల ఎత్తులో ఉన్న ఈ ఆంజనేయ స్వా మి విగ్రహాన్ని రెండో శతాబ్దంలో ప్రతిష్టించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది.
దైత వద్ద భక్తుల విడిది
హేమాచల క్షేత్రం పైకి వెళ్లే భక్తులకు మొదట ఆలయ సమీపంలో దైత అమ్మవారు (వనదేవత) దర్శనమిస్తారు. కొండపై ఉన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు దైత అమ్మవారి సమీపంలో విడిది చేస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కొంత మంది భక్తు లు దైత అమ్మవారికి కోళ్లను, మేకలను మొక్కుగా చెల్లిస్తారు.
హేమాచల క్షేత్రంపై ఉన్న వృక్షసంపద, ఆలయం సమీపం లోని కోనేరు, చింతామణి జలపాతం, ఆలయ ప్రాంగణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, హేమా చల క్షేత్రం కొండ పైనుంచి సమీప గ్రామాల అందాలు పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకుంటాయి.
బ్రహ్మోత్సవాలు
ప్రతి ఏటా వైశాఖ శుద్ధపౌర్ణమి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు (మల్లూరు జాతర) వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మ వార్లకు కల్యాణం నిర్వహిస్తారు.ఈ ఏడాది జరగనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా 2026 మే 1న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.






