calender_icon.png 11 February, 2026 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సాగు’కే సాయం!

11-02-2026 02:35:00 AM

పంటలు వేయని భూములకు ‘రైతుభరోసా’ కట్

  1. రాష్ట్రంలో 10,600 గ్రామాల్లో శాటిలైట్ సర్వే
  2. సాగుకు యోగ్యంగా 1.53 కోట్ల ఎకరాల భూమి గుర్తింపు 
  3. సుమారు 20లక్షల ఎకరాల్లో పంటలు వేయని రైతులు 
  4. త్వరలో ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే నివేదిక
  5. సాగుచేయని భూమికి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని సర్కార్ నిర్ణయం 
  6. గత వానాకాలం పంటల లెక్కింపుతో 
  7. యాసంగి పంటలు వేసిన రైతులకు నష్టం
  8. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): సాగు భూములకే  రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం  ప్రతి ఏటా ఎకరాకు రూ. 12 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద  రెండు పర్యాయాలు రైతు ఖాతాలో  జమ చేస్తున్న  విషయం తెలిసిందే. గత ప్రభుత్వం గుట్టలు, రాళ్లు, వెంచర్లకు రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసింది. 

తాజాగా పట్టా ఉన్న ప్రతి భూ మికి కాకుండా సాగు చేసిన భూములకు మాత్రమే పెట్టబడి సాయం అందించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే యాసంగి సీజన్ నుంచి అమ లు చేయనున్నట్లు సమాచారం. అందుకు వానాకాలం సీజన్‌లో జరిగిన సాగు వివరాల ప్రతిపాదికన అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే నిర్వహించగా, సాగుకు యోగ్యమైన భూమి 1.53 కోట్ల ఎకరాలు ఉన్నట్లుగా తేలింది.

ఈ భూమిలో సుమారు 20 లక్షల వరకు సాగు చేయలేదని, ఎలాంటి పంటలు వేయకుండా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. గత వానాకాలం పంటల విస్తీర్ణానికి సంబంధించి చేపట్టిన  శాటిలైట్ సర్వే వివరాలను వ్యవసాయ యూనివర్సిటీ త్వరలోనే ప్రభుత్వానికి అందజేయ నుంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో అర్హులకు మాత్రమే రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. అయితే సాగు భూముల వివరాలు లెక్కించేందుకు రాష్ట్రంలోని 10,600 గ్రామాల్లో  శాటిలైట్  సర్వే ద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు  పంటల విస్తీర్ణం లెక్క లు పూర్తి చేశారు. గ్రామ రెవెన్యూ మ్యాప్ లు అందుబాటులో లేని 870 గ్రామాలను మినహాయించారు. 

20 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా..

పంటల విస్తీర్ణం సంబంధించి శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారిగా పంటల లెక్కింపు జరిగింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూములు అధికంగా ఉన్నట్లు తేలింది. సర్వే కోసం 4 నెలల పంట కాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా విశ్లేషణ చేసి.. 92 శాతం వరకు కచ్చితత్వాన్ని సాధించినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలినట్లు సమాచారం.  వ్యవసాయ యూనివ ర్సిటీ నేతృత్వంలో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెం టర్లు, రిమోట్ సెన్సింగ్ ల్యాబ్‌లను ఏర్పా టు చేశారు.

ఉమ్మడి అదిలాబాద్, మహబూబ్‌నగర్, జిల్లాల్లో సాగునీటి లభ్యత తక్కువగా ఉండటంతో.. ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీటి సౌకర్యం ఎక్కు వగా ఉన్న జిల్లాలో సాగు చేయకుండా వదిలిన భూముల తక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాల భూ మి సాగుకు అనుకూలంగా ఉంటే  .. అక్కడ 400 నుంచి 450 ఎకరాల వరకు సాగు జరిగినట్లుగా శాటిలైట్ స్పష్టం చేసింది. శాటిలైట్‌కు సంబంధించి ప్రభుత్వం 20 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించింది.

గతేడాది డిసెంబర్ 23 వరకు అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూ డెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శాటిలైట్  సర్వే జరిగింది. ఈ జిల్లాల్లో 114 మండలాల్లోని 318 క్లస్టర్లలో ప్రక్రియ పూర్తి చేసి.. సాగుభూముల వివరాలను లెక్కించారు. పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్న జిల్లాల్లో సాగు విస్తీర్ణం పూర్తిగా విజయవంతం కావడంతో.. మిగతా జిల్లాలల్లోనూ అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

లోటుపాట్లను సరిచేయడానికి ఏఈఓలతో మరోసారి సర్వే  

ఈ శాటిలైట్ సర్వేతో రైతు భరోసా నుంచి పంట బీమా అమలులో రైతులకు సకాలంలో నష్టపరిహారం అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడనుంది. సర్వే  లెక్కలతో ప్రభుత్వం అందించే పథకాలు అర్హులైన రైతులకు చేరుతాయని అధికారులు భావిస్తున్నారు. పంటలకు చీడపురుగులు, వరదలు, తుపాన్ల వల్ల జరిగే పంట నష్టం అంచనా వేయడానికి ఈ టెక్నాలజీ వినియోగించనున్నారు.

అయితే శాటిలైట్  సర్వేద్వారా చేపట్టిన  వివరాలను అగ్రికల్చర్ వర్సిటీ ప్రభుత్వానికి అందజేసిన తర్వాత.. ఆ లెక్కల్లో ఏమైనా లోటుపాట్లు  ఉంటే వాటిని సరి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సర్వే నంబర్ల ద్వారా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే శాటిలైట్ ద్వారా వానాకాలం పంటల వివరాలను నమోదు చేస్తే యాసంగిలో పంటలు వేసిన రైతులకు రైతుభరోసా విషయంలో అన్యాయం జరుగుతుందని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.