ఏజెన్సీలో భారీ వర్షం.. గిరిజన గ్రామాలకు ఇబ్బందులు
ఉట్నూర్,(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం కురిసిన వర్షానికి ఏజెన్సీ గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల కు అడ్డంగా ఉన్న వాగులు వర్షానికి పాడుతున్నాయి. దీంతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని వాగులు దాటవలసిన పరిస్థితి నెలకొంది.
ఉట్నూర్ మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజంపేట్, వంకతుమ్మ ‘ఎ’ వంకతుమ్మ ‘బి’ గ్రామ ప్రజల పరిస్థితి వర్షాకాలంలో అత్యంత దయనీయంగా మారుతోంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు స్థానిక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, ఈ మూడు గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ మూడు గ్రామాలకు వెళ్లే ముఖ్య రహదారిలోనే ఈ వాగు ఉండటం వల్ల, చిన్నపాటి వర్షం పడినా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతోంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, గర్భిణీలు, వృద్ధులకు అత్యవసర వైద్య సేవలు కావాలన్నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వాగు దాటాల్సి వస్తోంది. ఉట్నూర్ పట్టణానికి చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు వరద ఉధృతి వల్ల ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అ గ్రామాలలో ఉపాధ్యులు కూడా రాలేని ఇబ్బంది ఏర్పడింది.






