27 May, 2026 | 2:11 PM

అర్థరాత్రి భారీ వర్షం.. తడిసిన ధాన్యం.!

27-05-2026 12:49 PM

తిమ్మాజిపేటలో అత్యధికంగా 88 మి.మీ వర్షపాతం నమోదు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో( Nagarkurnool district) మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం(Heavy rain ) కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆయా నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయించేందుకు తీసుకువచ్చిన వరి మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆయా వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రక్షణ కొరకు ఏర్పాటు చేసే టార్పాలిన్లు సరిపడా లేకపోవడంతో అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు.

మరోపక్క రైస్ మిల్లర్లు తరుగు ప్రేమ వంటి సాకులు చూపి వాహనంలోని ధాన్యాన్ని దింపుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో అత్యధికంగా 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేటలో 47.8 మి.మీ, కల్వకుర్తి యెల్లికల్‌లో 46.3 మి.మీ, ఉప్పునూతల వెళ్టూర్ లో 43.5 మి.మీ వర్షపాతం నమోదైంది. తెల్కపల్లి, వంగూరు, తాడూరు, నాగర్‌ కర్నూల్, బిజినపల్లి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు గ్రామాల్లో రహదారులపై నీరు నిలిచిపోగా ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్మకాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల ధాన్యం కుప్పలను టార్పాలిన్లతో కప్పి రక్షించే ప్రయత్నం చేశారు. ఈ వర్షాలు సాగుకు ఉపయోగకరమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.