ప్రకృతి ప్రకోపం... కుటుంబం గాయాలపాలు... ఆదుకోవాలని వేడుకోలు
ఖానాపూర్ (విజయక్రాంతి): రెక్కాడి తే గాని డొక్కాడని కుటుంబాలు వీరివి మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు ఇంటి పైకప్పు కొట్టుకుపోవడంతో రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అంతేకాదు పైనుంచి పడిన దూలాలకు కుటుంబీకులు తీవ్ర గాయాల పాలయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మంగళవారం గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది.
దానికి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న బోగు నరసయ్య, రవి కుటుంబంలో పలువురికి గాయాలయ్యాయి .రాత్రి అదే వర్షంలో గాయాలతో బిక్కు బిక్కు మెంటు కూర్చున్న వారిని చూచి స్పందించిన స్థానిక కౌన్సిలర్ గుమ్ముల అశోక్ వారిని ఆసుపత్రిలో చికిత్స చేపించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. కాగా వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వెలిబుచ్చారు. భార్య భర్త చిన్నపిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రభుత్వం తగు సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






