1 August, 2026 | 1:35 AM

ప్రాజెక్టుల్లోకి భారీ వరద

01-08-2026 12:53 AM

కాళేశ్వరం పుష్కరఘాట్ తాకిన గోదావరి

భద్రాచలం వద్ద 51.55 అడుగుల మేర వరద

మేడిగడ్డ 85గేట్ల ఎత్తివేత

గోదారిలో చిక్కుకున్న 60 మందిని రక్షించిన అధికారులు

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 31: గతం మూడు రోజులుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎస్పీకి, నిజాంసాగర్, ఎల్లంపల్లి, కడెం జలాశయాలకు ఉధృతంగా వరద వస్తోంది.

కాళేశ్వరం పుష్కరఘాట్‌ను గోదావరి ప్రవాహం తాకింది. అధికారులు మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మేడిగడ్డ బరాజ్ 85గేట్ల ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. గోదారిలో చిక్కుకున్న 60 మందిని అధికారులు తమ ప్రాణాలకు తెగించి రక్షించారు. ఎస్‌హెచ్‌ఓ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి రెస్క్యూకు అభినందనలు వెల్లువెత్తాయి. జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి.

చెరువులు, కుంటలు నిండుకుండాల కళకళలాడుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువుమత్తడి దుంకుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లాలోని సింగీతం ప్రాజెక్టు నిండడంతో మూడు గేట్లను అధికారులు ఎత్తారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీవరద వచ్చి చేరుతుంది. కౌలస్నాల, భీమేశ్వరవాగు, దోమకొండలోని గొట్టిముక్కుల వాగు, లింగంపేటవాగు, గాంధారి వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి.

కామారెడ్డి పెద్దచెరువు అలుగు పారింది. పంట పొలాలు నీట మునిగి రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో ఉమ్మడి జిల్లాలో జలకళ సంతరించుకోవడమే కాకుండా చెరువులు, కుంటలు నిండి నీటి కుండల మారాయి. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్ పై నీటిప్రవాహం క్రమేపి పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న మేడిగడ్డ బరాజ్‌లోకి భారీ వరద వస్తుండడంతో బరాజ్ 85గేట్లు ఎత్తి, దిగువన అదే లెవల్లో నీరు వదులుతున్నారు. ములుగు జిల్లాలో రామన్నగూడెం(వీ), ఏటూరునాగారం (ఎం) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. 

మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చి జంపన్న వాగులో గల్లంతైన వ్యక్తి కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం రెండు రోజులుగా ముమ్మర గాలింపు చర్యలు నిర్వహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని చర్ల మండల పరిధిలోని వీరాపురం గోదావరి ఇసుక ర్యాంప్ వద్ద ఒక్కసారిగా వరద పోటెత్తడంతో చిక్కుకున్న 60 మందిని అధికారులు ప్రాణాలకు తెగించి రక్షించారు. చర్ల ఎస్‌హెచ్‌ఓ, ఎస్సై తెప్పల సహాయంతో గోదావరి దాటి, ఒక్కొక్కరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.