యూరప్ విలవిల
బెంబేలెత్తిస్తున్న వడగాలులు
తీవ్రతకు ఫ్రాన్స్‌లో 40 మంది మృతి
బ్రిటన్‌లో కరుగుతున్న తారు రోడ్లు
ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్‌లలో రెడ్ అలర్ట్ జారీ
స్పెయిన్, పోర్చుగల్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులు
పారిస్, జూన్ 23: యూరప్‌ను వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45, 40 డిగ్రీలు దాటాయి. ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్‌లో వడగాలులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వడగాలుల కారణంగా ఆయా దేశాల్లోని అడవుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయి. ఫ్రాన్స్‌లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో పారిస్‌వాసులు, పర్యాటకులు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. శాస్త్రవేత్తలు దీన్ని ‘ఒమేగా బ్లాక్’గా వ్యవహరిస్తున్నారు.
దీంతో ప్రభుత్వం రోడ్లపై ఉపశమనం కోసం స్ప్రింకర్లను ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్‌లోని పశ్చిమ వైన్ బోర్డోలో 41.9, స్పెయిన్‌లోని శాన్ సెబాస్టియన్‌లో 40 డిగ్రీలకు చేరుకుంది. వేడిగాలుల వల్ల ఆరోగ్య సమస్యలతో 80 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు వృద్ధులు మృతిచెందారని, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్ ప్రాంతాలలో ఈత కొట్టేందుకు వెళ్లి ౩౫ మంది వరకు నీటిలో మునిగి మృతి చెందారని, వీరిలో అత్యధికులు యువకులే ఉన్నారని తెలిపింది. మరో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందినట్లు ప్రకటించారు.
వడగాలుల తీవ్రతకు బ్రిటన్‌లోని రోడ్లపై ఉన్న తారు కరిగిపోతుంది. కింగ్స్ క్రాస్, పిటర్బర్ మధ్య రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న ఓ సిగ్నల్ లైట్ కరిగిపోయింది. ఈ దృశ్యాలు కాస్త వార్తామాధ్యమాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. బ్రిటన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మంగళవారం 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇంగ్లాండ్‌లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. లండన్‌లోని మాంచెస్టర్‌లో మధ్యాహ్నం రోడ్లపై వాహనాలు నడవడం లేదు. వడగాలుల వల్ల లండన్‌లో రెండు రోజుల్లో 10 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాఠశాలలను మూసివేశారు.
ఈ ఏడాది సాధారణం కంటే 5 నుంచి 10 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్పెయిన్ వాతావరణ శాఖ ప్రకటించింది. స్పెయిన్‌లోని 36 ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగి 70వేల హెక్టార్ల అటవీ ప్రాంతం నాశనమైంది. 13వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పోర్చుగల్‌లో కూడా కార్చిచ్చుల వల్ల 160 మందికి గాయాలు కాగా, 30వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించిన అగ్నిమాపకశాఖ విమానం పైలెట్ ఒకరు మృతి చెందారు. మరోవైపు అమెరికాకు కూడా వడగాలుల హెచ్చరిక జారీ అయింది.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం టెక్సాస్, లాస్ ఏంజిల్స్, ఓక్లహోమా, మిస్సీసీపీ వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా తీవ్రమైన వాతావరణంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. కార్చిచ్చులు, వడగాలుల కారణంగా మానవాళిలో సగం మంది ప్రమాదపుటంచుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇటలీలో 12 నగరాలకు వడగాలుల రెడ్ అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది.






