24 June, 2026 | 3:40 AM

పెరియార్ నాస్తికత్వాన్ని అంగీకరించం!

24-06-2026 12:30 AM

ద్రవిడ, సామాజిక ఆలోచనలను మాత్రం ఆమోదిస్తాం

దేవుడిని విశ్వసిస్తాం.. ఏ భావజాలానికీ మేం వ్యతిరేకం కాదు

ఎవరితోనూ జత కట్టకుండా అధికారంలోకి వచ్చాం

నేరుగా నేను సీఎం కుర్చీని అధిరోహించలేదు..

రాజకీయ పార్టీ స్థాపించక ముందు నుంచే ప్రజల మధ్య ఉన్నా

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ వ్యాఖ్యలు 

చెన్నై, జూన్ ౨౩: ‘సామాజికపరంగా, ద్రవిడ ఉద్యమపరంగా పెరియార్ ఈవీ రామస్వామి విస్తృత ఆలోచనలను ఆమోదిస్తాం.. కానీ, నాస్తికత్వ సిద్ధాంతాన్ని అంగీకరించలేం. మేం దేవుడిని సంపూర్ణంగా విశ్వసిస్తాం. మేం ఎవరి భావజాలానికీ వ్యతిరేకం కాదు. మేమంతా ఆస్తికులం’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తమ పార్టీ సిద్ధాంతాలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన చెన్నై అసెంబ్లీలో ప్రసంగించారు. తమిళ వెట్రి కజగం (టీవీకే) కేవలం ఒక నటుడికి చెందిన పార్టీ కాదని , తమది ప్రజల పార్టీ అంటూ అభివర్ణించారు. తమది నటుడి పార్టీ అని భావించే వారికి, తమ వెనుక ఉన్న ప్రజల పునాదిని అర్థం చేసుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

తాను నేరుగా సినిమా షూటింగ్ సెట్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించలేదని, రాజకీయ పార్టీ స్థాపించకముందే ప్రజల మధ్య ఉన్నానని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో జతకట్టకుండానే ఒంటరిగా పోటీ చేసిగెలిచామని ఉద్ఘాటించారు. ప్రజలు తమకు 35 శాతం ఓట్లు వేశారని, మొత్తంగా 1.72 కోట్ల ఓట్లు సాధించి తిరుగులేని విజయం సాధించామని గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమానత్వ, సామాజిక న్యాయ సిద్ధాంతాలను ఆచరణలోకి తీసుకువస్తామని ఉద్ఘాటించారు.

తొలితరం సీఎం కామరాజ్ నాడార్ పాలన తరహాలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని వ్యాఖ్యానించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోతే ఆ నిందను తమపై వేయాలని కొందరు చూశారని విమర్శించారు. గత ప్రభుత్వ పెద్దలు కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. పార్టీ నిధుల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం ఈ వ్యాఖ్యలు చేయగా, వెంటనే అసెంబ్లీ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తమది అత్యంత సామాన్య ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎగతాళి చేసినా, గెలిచి నిలబడ్డామని చెప్పుకొచ్చారు. గతంలో అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ నాయకత్వంలో సామాన్యుల ప్రభుత్వాలు ఉండేవని, అదే తరహాలో తాము కూడా ప్రభుత్వాన్ని నడుపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల పేరుతో తమిళనాడు విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తమపై భాషల రుద్దుడును అంగీకరించబోమని స్పష్టం చేశారు. తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.