4 April, 2026 | 11:56 PM

హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

04-04-2026 09:00 PM

- ఈట్ రైట్, ఎయిడ్స్ పై అవగాహన, యోగ, సేవ్ మదర్స్ డే లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి 

- 6 నుండి 11 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమం

- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్,(విజయక్రాంతి): హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా, గ్రామీణ స్థాయిలో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. 

ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సాధించవచ్చు అని, మహిళలు చిన్న పిల్లల అనారోగ్య సమస్యలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. వివిధ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేసినవారిని తిరిగి చికిత్సను అందించాలన్నారు. ఎయిడ్స్, క్యాన్సర్, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, సి సెక్షన్, ఎనీమియా , మత్తు పదార్థాల నిర్మూలన,లాంటి అనేక  వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆరు రోజుల హెల్త్ వి కార్యక్రమాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు.

ఈట్ రైట్, ఎయిడ్స్ పై అవగాహన, యోగ సేవ్ మదర్స్ డే,లాంటి కార్యక్రమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ఈ ఆరు రోజుల కార్యక్రమంలో అధికారులు, మహిళలు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, అందరిని భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆరవ తారీకు సోమవారం రోజున ఈట్ రైట్ వాక్ ను పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ వాక్ మున్సిపల్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగుతుందని తెలిపారు.