7 July, 2026 | 3:25 AM

హెచ్‌సీఏ అవినీతికి చిరునామా

07-07-2026 12:00 AM
  1. ఒకే క్లబ్‌కు రెండు రిజిస్ట్రేషన్లు
  2. పిటిషన్లు వేసిన వారే నిందితులతో కుమ్మక్కయ్యారు
  3. ఫోర్జరీలతో తప్పుడు ఓటింగ్ హక్కులు
  4. టీసీఏ సంచలన ఆరోపణలు

హైదరాబాద్, జూలై 6 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి, మోసాలకు చిరునామాగా మారిందని తెలంగాణ క్రికెట్ అసోసియేష(టీసీఏ) సెక్రటరీ ధరం గురువారెడ్డి ఆరోపిం చారు. ఒకే పేరుతో రెండు క్లబ్‌లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ఓటింగ్ హక్కులు, పిటిషన్లు వేసిన వారే నిందితులతో కుమ్మక్కవడం హెచ్‌సీఏలో సర్వసాధారణంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, కోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించి ఇష్టానుసారం అసోసియేషన్‌ను నడిపిస్తున్నారని మండిపడ్డారు.

ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్‌కు రెండు రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, అలాగే శ్రీ చక్రా క్లబ్‌ను సస్పెండ్ చేస్తే అదే క్లబ్ ప్రతినిధి హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యారని గుర్తుచేశారు. సర్దార్ దల్జీత్‌సింగ్, బసవరాజ్, ఇంతియాజ్‌ఖాన్ ఈ ముగ్గురూ అమీర్‌పేట్ సీసీ క్లబ్‌ను నడుపుతున్నారని ఆరోపించారు. గతంలో హెచ్ సీఏ అవినీతిని ప్రశ్నించిన వారే ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్‌లో పదవులు తీసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కుమ్మక్కయ్యారని గురువారెడ్డి ఆరోపించారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులకు హెచ్‌సీఏలో అనుమతి లేదనీ, కానీ ఇక్కడ మా త్రం అందరూ వారే ఉన్నారని విమర్శించారు. ఇక బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహించారన్నారు. జిల్లా క్రికెటర్లకే ప్రాధాన్యత అంటూ హడావుడి చేసి చివరికి హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లకే పెద్దపీట వేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే టీసీఏకు బీసీసీఐ గుర్తింపు వస్తుందని, తెలంగాణ క్రికెట్‌ను కాపాడే బాధ్యత తామే తీసుకుంటా మని ప్రకటించారు.