13 June, 2026 | 2:57 AM

హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారమైనవి

13-06-2026 12:14 AM
  1. ఆధారాలుంటే బయటపెట్టాలి
  2. దోచుకోవడం దాచుకోవడం మీ నైజం
  3. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడు కున్నవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నా రు. మొత్తం టెండర్ విలువ రూ.687.78 కోట్లు అయితే.. రూ.2 వేల కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని, ఏమైనా  ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలని, లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించ డం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. శుక్రవారం సచివాలయంలో మైనారి టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. ఈ టెండర్ ప్రక్రియ పూర్తిగా తెలం గాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా నిర్వహిస్తే  దేశవ్యాప్తంగా 27 బిడ్లు వచ్చాయని తెలిపారు.

టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్ 1 విధానంలో టెండర్లు ఖరారు చేసినట్లు మంత్రి అడ్లూరి వివరించారు. ఏ ఒక్క సం స్థకు కూడా నామినేషన్ పద్ధతిలో పని ఇవ్వలేదని, గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమన్నారు. హైకోర్టు సైతం కేంద్రీకృత కొనుగోలు విధానంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ప్రభుత్వ రంగ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లిడ్‌క్యాప్ సంస్థకు కేవలం రూ.40.21 లక్షల విలువైన పనులు మాత్రమే ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.  మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ రూ.687.78 కోట్ల టెండర్‌ను రూ.2 వేల  కోట్ల కుంభకోణంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు. హరీశ్‌రావు వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ విసిరారు.