21 April, 2026 | 4:33 AM

బీఆర్‌ఎస్ చీలికకు హరీశ్‌రావు యత్నం

21-04-2026 02:55 AM

ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరిక అంశంతో ఆ పార్టీలో ముసలం మొదలైందని, ఇప్పుడు చీలికకు కారణమవుతున్నట్టు కనిపిస్తున్నదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికను మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యతిరేకిస్తున్నారని, ఆయనను కేటీఆర్ బతిమాలుకుని జగిత్యాలలో  జీవన్‌రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాడని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

కేసీఆర్ ఫాంహౌస్‌కు జీవన్‌రెడ్డి వచ్చినప్పుడు హరీశ్‌రావు వెళ్లలేదని, బీజేపీ నేతలతో కలిసి హరీశ్‌రావు రహ స్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలున్నాయన్నారు. హరీశ్‌రావు అలక వెనుక కారణా లు ఏమిటీ? పార్టీలో చీలికకు ప్రయత్నం చేస్తున్నాడు?  అందుకే ఢిల్లీ వెళ్లాడనే అనుమానం కలుగుతోంది అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. హరీశ్‌రావు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి జీవన్‌రెడ్డి చేరిక వల్ల జరుగుతోందన్నారు.

జీవన్‌రెడ్డిని ఐరన్ లెగ్‌గా బీఆర్‌ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారని ఆరోపించారు. ఏడాది తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్తుంటే.. ఆ సభకు హరీశ్‌రావు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావును టార్గెట్ చేసుకుని కవిత విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిపో యార ని గుర్తుచేశారు. 

బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి ఒక్క రోజే వీఐపీ: ఎంపీ చామల

బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ అంధకారంలో ఉందని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీ నేతలకు ఇష్టం లేదని, హరీశ్‌రావు కూడా జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ అని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసని సోమవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుంటే హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.

హరీశ్‌రావు ఢిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారనేది త్వరలో బయటకు వస్తుందని, హరీశ్‌రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే ది ప్రజలకు తెలుసన్నారు. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కు వని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని, అయినా ఆయనకు  కాంగ్రెస్ సముచిత స్థానం ఇచ్చిందని, ఇప్పు డు బీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందన్నారు.