ఉపాధ్యాయుల సమస్యలపై సమరశంఖం
సెప్టెంబర్ 1న హైదరాబాద్‌కు భారీ తరలింపు
నాగల్‌గిద్ద, ఆగస్టు 30(విజయ క్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉపాధ్యాయుల మహాధర్నాను విజయవంతం చేయాలని నాగల్‌గిద్ద మండల పీఆర్టీయూ అధ్యక్షుడు శేరికర్ రమేశ్, కార్యదర్శి జీవన్‌రావు పాటిల్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వేదికగా జరిగే మహాధర్నాలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా సీరియస్‌గా తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విద్యా రంగంపై కూడా ప్రభావం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు ఉపాధ్యాయుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు.సంగారెడ్డి జిల్లా నుంచి సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాగల్‌గిద్ద మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఐక్యంగా కదిలి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరై తమ ఐక్యతను చాటాలని శేరికర్ రమేశ్, జీవన్‌రావు పాటిల్ స్పష్టం చేశారు.






