30 August, 2026 | 4:53 PM

రూ. 42లక్షల అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలి

30-08-2026 03:29 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలోని మణికూడ ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.42 లక్షలకు పైగా ప్రజాధనం వృథా చేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏ ప్రాతిపదికన రూపొందించారు, పనులను ఏ విధంగా కాంట్రాక్టర్లకు కేటాయించారు, నాణ్యతా ప్రమాణాలు పాటించారా అనే విషయాలను జిల్లా అధికారులు ప్రజలకు స్పష్టం చేయాలని కోరింది.ఇప్పటికే వెనుకబడిన జిల్లాగా ఉన్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ అన్నారు. 


అభివృద్ధి పనుల పేరుతో నాసిరకం పనులు చేపట్టి ప్రజాధనాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం మణికూడలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యతా లోపాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులపై నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని  డిమాండ్ చేశారు.