హరీశ్ పాదయాత్ర ఉనికి కోసమే..
టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి
సిద్దిపేట క్రైం, జూలై 20 : మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో చేపట్టిన పాదయాత్ర తన ఉనికిని చాటుకునేందుకు నిర్వహించిన రాజకీయ కార్యక్రమమేనని టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రంతో కలిసి ఆయన మాట్లాడారు.
పాదయాత్రకు రూ.500 నుంచి రూ.1,500 వరకు చెల్లించి, రైతుల పేరుతో పార్టీ కార్యకర్తలనే సమీకరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
వచ్చే మున్సిపల్, శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాకి ఆనంద్, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ తప్పెట శంకర్, తదితరులు పాల్గొన్నారు.






