14 August, 2026 | 4:17 PM

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

14-08-2026 02:58 PM

ఎమ్మెల్యే హరీశ్‌బాబు

దేశభక్తి నినాదాలతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు, యువత జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీకి ముందు విద్యార్థులు సామూహికంగా వందే మాతరం ఆలపించారు. ఈ సందర్భంగా సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే క్రమంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. నరేంద్ర మోదీ పాలన దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్‌ ఖాండ్రే విశాల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగేల నాగేశ్వర్‌రావు, ఎస్టీ మోర్చా నాయకుడు కోట్నాక్‌ విజయ్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు సతీష్‌బాబు,జాడి అశోక్‌, మల్లికార్జున్ యాదవ్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.