14 August, 2026 | 4:16 PM

మంత్రి తుమ్మల అరుదైన రికార్డు

14-08-2026 02:55 PM

• రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టం

• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 21సార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జండా ఆవిష్కరణ

• నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం 

• 4 ప్రభుత్వాల సాక్షిగా ఒకే గౌరవం

• ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు ఒకటి ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరిట లిఖితం కానుంది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో దేశంలో రాజకీయాల్లో పార్టీలు  మారతాయి. ప్రభుత్వాలు మారతాయి. కానీ ఒక నేత పట్ల ప్రజావిశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు.

 తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఇది అక్షర సత్యం ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేసే గౌరవం వరుసగా ఆయనకే దక్కుతూ వస్తోంది. ఇప్పటికే 20సార్లు ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న తుమ్మల, ఈనెల 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21వసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదొక సరికొత్త ఘట్టంగా నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేయడం ప్రతి నేతకూ లభించే గౌరవం. అలాంటి అరుదైన అవకాశం తుమ్మలకు ఏకంగా 20 సార్లు దక్కడం, ఈనెల 15న 21వ సారి దక్కనుండటం విశేషం.

నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. మైనర్ ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, మేజర్-మైనర్ ఇరిగేషన్ వంటి కీలక శాఖలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా...

రాజకీయ ప్రస్థానంలో తుమ్మల ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈ సుదీర్ఘ ప్రజాజీవితంలో మంత్రిగా ఉన్న దాదాపు ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ చేసిన ఘనత ఆయనది. వేర్వేరు రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల మార్పుల మధ్య కూడా ఈ గౌరవం వరుసగా దక్కడం ఆయన సుదీర్ఘ ప్రజాజీవితానికి నిదర్శనంగా నిలుస్తోంది.

20 సార్లు జెండా ఆవిష్కరణ.. ఇప్పుడు 21వ సారి

1985 నుంచి 1989 వరకు ఐదుసార్లు, 1995 నుంచి 2003 వరకు తొమ్మిదిసార్లు, 2015 నుంచి 2018 వరకు నాలుగుసార్లు, 2024, 2025 సంవత్సరాల్లో ఒక్కోసారి చొప్పున ఇప్పటివరకు 20 సార్లు తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు 15న 21వసారి ఈ గౌరవం దక్కడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఈనెల 15న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయనకు, తన సొంత ప్రాంతానికి ఆనుకుని ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బాధ్యత దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధిగా తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటూ వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు రికార్డు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైనదిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నలుగురు ముఖ్యమంత్రుల పాలనా కాలాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకావిష్కరణ చేసిన అనుభవం చాలా తక్కువ మంది నేతలకు మాత్రమే దక్కుతుంది. ఈ కోణంలో చూస్తే, తుమ్మల నాగేశ్వరరావుది నిరాటంకమైన, స్థిరమైన రాజకీయ జీవితానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇప్పటివరకు తుమ్మల జాతీయ పతాకావిష్కరణ చేసిన సంవత్సరాలు

1985, 1986, 1987, 1988, 1989, 1995, 1996, 1997, 1998, 1999, 2000, 2001, 2002, 2003, 2015, 2016, 2017, 2018, 2024, 2025