భక్తి శ్రద్ధలతో అర్ధమండల దీక్షలు ప్రారంభం
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుమారు 120 మంది హనుమాన్ భక్తులు దీక్షలను స్వీకరించారు. ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ఒజ్జల శిరీష్ శర్మ, మహేష్ శర్మ, సతీష్ శర్మల ఆధ్వర్యంలో గణపతి పూజ, నవగ్రహ పూజ, ఆంజనేయస్వామికి రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామ పూజ, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహా ఆశీర్వచనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అనంతరం దీక్షాపరులకు మాలధారణ కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్వహించారు. దీక్షా కాలంలో పాటించవలసిన నియమ నిబంధనలను అర్చకులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిన్నా వివేక్, ఎకిరాల శ్రీనివాస్, నారాయణమూర్తి, గుండా వెంకన్న, లక్ష్మణమూర్తి, మధు, సుధాకర్, గణపతి, రాకేష్, తిరుపతి తదితరులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.




