మినీ గురుకులాన్ని సందర్శించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం మల్లాపూర్‌లోని మినీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, బోధనలో ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల తదితర సదుపాయాలను పరిశీలించిన పాలకవర్గ సభ్యులు విద్యార్థుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి, ఆహార ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో ముచ్చటించారు. పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలపై సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రియాంకతో పాటు సిబ్బంది సుమలత, సునీత, శ్రీలత, సులోచన విద్యుత్, డైనింగ్ హాల్‌కు సంబంధించిన సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, భూక్యా శేఖర్, అల్లె చంద్రయ్య, ముత్యాల గంగారాజం, మహమ్మద్ షబ్బీర్, శనిగారపు నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..






