1 August, 2026 | 9:49 PM

పేద విద్యార్థులకు చదువు దూరం చేయొద్దు

01-08-2026 08:50 PM

- ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ తొలిగించే కుట్ర మానుకోవాలి 

- నీను బీసీ నాయకుడిని దేశమంతా తిరుగుతా

- ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించు

- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

- హస్తినాపురంలో విద్యార్థులతో కలిసి ఆందోళన

ఎల్బీనగర్: ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకాలను ఎత్తేయాలనే కుట్రలను సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని, పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన రూ, 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ నేతృత్వంలో శనివారం వేలాది మంది విద్యార్థులు హస్తినాపురం చౌరసా వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు.​

ఈ ఆందోళనలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ...ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ కు బడ్జెట్ కేటాయించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద కులాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తోందని, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఫీజుల రియంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర మాత్రమే కాకుండా, ఏకంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు.

బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న గురుకులాలను కూడా రద్దు చేసేందుకు తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయి. గత ముఖ్యమంత్రులంతా విద్యాభివృద్ధికి కృషి చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గొడ్డలితో నరికే తిరోగమన చర్యలకు పాల్పడుతోంది.​  2007లో అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముందుచూపుతో ఈ పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రంలో ఈ పథకం ఎంతో ఘనంగా అమలువుతుంటే, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో దీని అమలుకు వస్తున్న అడ్డంకులేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాను బీసీ నాయకుడిని అని, దేశమంతా తిరుగుతా అని, తెలంగాణ నా రాష్ట్రమని, ఇక్కడి విద్యార్థులు చదువుకు దూరమైతుంటే ప్రశ్నించకుండా అంటానా? అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు ఒక చిన్న స్కీమ్ కూడా పెట్టలేదని,  బీసీ శాఖలో కమిషనర్, సెక్రటరీగా ఇతరులను నియమించి బి.సి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 76 సంవత్సరాలుగా అగ్రకులాలే సీఎంలు, మీరే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజ్యమేలారు.

దేశాన్ని దేశ సంపదను దోచుకున్నారు. ఇప్పుడు బీసీలు చదువుతుంటే కూడా ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పాత పద్ధతిలోనే రీయింబర్స్ మెంట్ కొనసాగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పగిళ్ల సతీష్, నీలం వెంకటేశ్, జిల్లపల్లి అంజి, అనంతయ్య, రాజేందర్, శివ కుమార్ యాదవ్, ఆర్కే గౌడ్, మెరపాక సతీశ్, మొగిలి కృష్ణయ్య, సిద్దు, అంజాగౌడ్, పృథ్వీగౌడ్, తదితరులు పాల్గొన్నారు.