సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు
* పారిశుద్ధ్య నిర్వాహణ లోపిస్తే కఠిన చర్యలు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
* ధాన్యం సేకరణలో జాప్యం తగదు
* జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
అచ్చంపేట: పారిశుద్ధ్య నిర్వాహణ లోపిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. రహదారుల పరిశుభ్రత, మురుగు కాల్వలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ అచ్చంపేటలో పర్యటించారు. మున్సిపాలిటీలో శానిటేషన్ పనులను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో మురుగు నిల్వలు ఉండకుండా చూడాలని కమిషనర్ మురళికి సూచించారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో నిర్మాణంలోని ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి.. పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి వైద్యాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన ర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పర్యటించి .. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణం.. ఇంకా ఎంత మేరా ధాన్యం కల్లాల్లో ఉండచొచ్చనే అంఛనాను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళు పక్రియ సజావుగా సాగేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో పనులను పరిశీలించి.. పార్కింగ్ వసతి గురించి సమీక్షించారు. జినుకుంటలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని.. ప్రజలతో మాట్లాడారు. గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదికని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌళిక వసతులు కల్పన గురించి సమీక్ష నిర్వహించారు. లాభదాయక పంటలపై రైతులు మొగ్గు చూపాలన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వినియోగించేలా చూడాలన్నారు. ఆయా చోట్లా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆర్డీవో యాదగిరి, తహశీల్దార్ సైదులు, శ్రీకాంత్, డీపీవో శ్రీరాములు, ఎంపీడీవో రాఘవులు, సీడీపీవో దమయంతి, కమిషనర్ మురళి, ఏఈ రాజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
* గ్రామసభలో వృద్ధునికి ఆప్యాయ పలకరింపు
జినుకుంటలో నిర్వహించిన గ్రామసభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సీనియర్ సిటీజన్ గోరంట్ల సంజన్న (80)ను ఆప్యాయంగా పలకరించారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితి, అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగారు. ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రతలను ఆలకించారు. వృద్ధులకు అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






