8 June, 2026 | 5:28 PM

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి

08-06-2026 04:25 PM

* పొనకల్ గ్రామసభలో సర్పంచ్ సుష్మ

జన్నారం,(విజయక్రాంతి): గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు తన వంతుగా సహకరించాలని సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో సర్పంచ్ మాట్లాడారు. గ్రామంలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

గ్రామంలో శానిటైజేషన్ (పారిశుధ్యం) పనులను ముమ్మరం చేయడం, మురుగు కాలువల పూడికతీత, రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్ళపొదల తొలగింపు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వంటి అంశాలపై చర్చించి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యీకరణ ప్రాధాన్యతను, ప్రస్తుత ఓటర్ లిస్ట్ రివిజన్ ప్రక్రియను ప్రజలకు వివరించారు. రోడ్ సేఫ్టీ, శాంతిభద్రతలపై ఎస్సై ఉదయ్ కిరణ్ అవగాహన కల్పించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.