చినుకు పడితే చిత్తడే.."ప్రయాణ ప్రాంగణం గుంతల మయం "
వర్షపు నీరు నిలిచిపోయి బురదమయం
గంభీరావుపేట జులై 31(విజయక్రాంతి): ప్రస్తుతం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు గంభీరావుపేట ప్రయాణ ప్రాంగణం అసౌకర్యంగా మారింది. గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు నిలిచి ప్రయాణ ప్రాంగణంలోకి అడుగు పెట్టేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఒకపక్క సిమెంటుతో ఫ్లోరింగ్ చేసి మిగిలిన భాగం అలాగే ఉంచేశారు దీంతో వర్షాలు పడినప్పుడు గోతుల్లోకి నీరు చేరి బురద మయంగా తయారవుతుంది. లోపలికి వెళ్లాలంటే కాళ్లు నిండా బురద అంటుకుంటుంది. ప్రయాణ ప్రాంగణ ఆవరణలో చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.రోజుల తరబడి నీరు నిల్వ ఉండడంతో గుంతలు ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రయాణ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.






