మరుగుదొడ్లు లేక ప్రయాణికుల అవస్థలు
ఏళ్లు గడుస్తున్నా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంలో నిర్లక్ష్యం
నిజాంసాగర్ జూలై 31( విజయక్రాంతి): నిత్యం వందల సంఖ్యలో బస్సులు ప్రయాణిస్తూ వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో గల పురాతన ప్రయాణ ప్రాంగణం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. గతంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణంలోని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో నూతన మరుగుదొడ్లను నిర్మించకపోవడంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నిజాంసాగర్ ప్రయాణ ప్రాంగణం గుండా కామారెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్, హైదరాబాద్, బీదర్ సుదూర ప్రాంతాలకు వందలాది బస్సులు ప్రయాణిస్తున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాల, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, విద్యార్థులు ప్రతినిత్యం ఈ ప్రయాణ ప్రాంగణం ద్వారా పాఠశాలలకు చేరుకుంటారు. వారికి కనీస మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జనకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు ఇకనైనా స్పందించి ప్రయాణ ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మాణం చేయడానికి కృషిచేసి ఇబ్బందులను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్ టీ సి అధికారులు నాయకులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.






