తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
ప్రభుత్వ వైఫల్యం వల్లే కొనుగోళ్లు ఆలస్యం
రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా.
మాజీ ఎమ్మెల్యే మర్రి, బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): అకాల వర్షానికి తడిపిన మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
గత 25 రోజులుగా మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఫలితంగా కష్టపడి పండించిన పంటను పోగొట్టుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని తమ వెన్నంటే అండగా ఉంటామని ప్రభుత్వం దిగివచ్చి పంటను కొనుగోలు చేసేదాకా పోరాడుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.






