25 May, 2026 | 1:39 PM

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ నాటకాలు

25-05-2026 12:54 PM

హైదరాబాద్: లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు(Grain Transport) ఆలస్యం అవుతూందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Govt Whip Adi Srinivas) సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తోందని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని వెల్లడించారు. ఈ లోపు వర్షం పడి ధాన్యం తడిసినా.. ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు.

ధాన్యం తడిసి రంగు మారినా.. కొనుగోలు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల టన్నులనే కొనుగోలు చేస్తామని చెప్పినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు(BJP Leaders) లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. కేంద్రం మాత్రం 52 లక్షల టన్నులకే మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిందని ఆది శ్రీనివాస్ వివరించారు.

తెలంగాణలో మొత్తం ధాన్యం కొనాలని బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా.. మొత్తం ధాన్యం కొనుగోళ్లను రాష్ట్రం చేపట్టిందన్నారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మరో 70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. రైతులను అడ్డం పెట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( బీఆర్ఎస్ నేత హరీశ్ రావు) రాజకీయాలు ఆపి.. బీజేపీ ప్రభుత్వం వద్దకు వెళ్లి అడగాలని సవాల్ విసిరారు. అటు ధాన్యం కొనుగోళ్లపై రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.