19 August, 2026 | 9:15 PM

ప్రభుత్వాలు దళిత సమస్యలను విస్మరించాయి

19-08-2026 08:16 PM

దళిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ తో ముందుకెళ్లాలి

మల్లేపల్లి లక్ష్మయ్య, ఛైర్మెన్ ఐడిజెఎన్, ఓఎస్డి బుద్ధవనం

జుక్కల్,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సమస్యలను పూర్తిగా విస్మరించాయని, ప్రజా ప్రతినిధులు సైతం వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదని ఐడిజెఎన్ ఛైర్మెన్, బుద్ధవనం ఓఎస్డి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో ఐడిజెఎన్ రాష్ట్ర సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడారు. దళిత సమస్యలపై జర్నలిస్టుగా ముందు మీరు స్పందించి ప్రతి సమస్యపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులకు నివేదించాలని అన్నారు.

2013 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు తమ భూములను కోల్పోతున్నారని అన్నారు. వీటిపై ఏ ప్రభుత్వ కార్యాలయాలలో వివరాలు లేవని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో శ్మశాన వాటిక, క్రీడా మైదానం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, పరిశ్రమలు, పాఠశాలలు ఇలా ఏ ప్రజాపయోగ కార్యక్రమానికి అయిన దళితుల భూములను బలవంతంగా తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. వీటిపై ఎన్ని పిర్యాదులు వచ్చిన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదు.

అలాగే ప్రభుత్వం ప్రజా అవసరాల నిమిత్తం తీసుకున్న భూములకు నష్ట పరిహారం ఇవ్వడంలో కూడా తగినంత అందడం లేదన్నారు. ఇలాంటి సమస్యలపై ప్రతి దళిత జర్నలిస్టు స్పందించి గ్రామీణ స్థాయిలో వివరాలు సేకరించాలని అన్నారు. ఇందు కోసం ఐడిజెఎన్ బృందం మండలాల వారిగా పని చేసి వివరాలు సేకరించాలని సూచించారు. ఇప్పటికే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు దళిత సంక్షేమ పథకాలను తుంగలో తొక్కాయని అన్నారు. క్షేత్ర స్థాయిలో నివేదికలతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి పని చేయాలని అన్నారు.

అలాగే దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రత్యేక నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించి పని చేయాలని కోరారు. రాష్ట్రాల మధ్య మీడియా తో సమన్వయం చేస్తున్నామని, ఇందులో ఐడిజెఎన్ పని చేస్తుందని అన్నారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఐడిజెఎన్ కో ఆర్డినేటర్ లక్ష్మి నారాయణ, రాష్ట్ర కన్వీనర్ మంద జనార్ధన్, రాష్ట్ర కో - కన్వీనర్ ఎడ్ల సంజీవ్, ఆయా జిల్లాల ఇంచార్జీలు రాజలింగం, సాయిరాజ్, నవజీవన్, తదితరులు పాల్గొన్నారు.