మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అండ
మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్, జూన్ 30: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘ భవనం, ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ వనజ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో 15 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి 2022-23 నిధులతో గ్రామైక్య సంఘ భవనం ప్రారంభించడం జరిగిందని, మహిళల సంక్షేమంలో భాగంగా వివిధ వ్యాపార రంగాలలో మహిళా భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ అవసరమైన రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తుందని, మహిళా సంక్షేమంలో భాగంగా అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని, రాష్ట్రంలో 21 వేల కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించడం జరిగిందన్నారు. రుణ సదుపాయం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే మరింత రుణం పొందవచ్చని సూచించారు.
పెట్రోల్ బంకుల ఏర్పాటు, నిర్వహణకు మహిళా సంఘాలకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు.






