సర్కారు బడి.. వసతులు కొరవడి..
- శిథిలావస్థకు చేరిన పాఠశాలతో విద్యార్థులకు అవస్థలు
పెచ్చులూడుతున్న పైకప్పు దుమ్ముపట్టిన ప్రయోగ పరికరాలు..
అంధకారంలో విద్యార్థుల భవిష్యత్
నూతనకల్, ఏప్రిల్ 8: దేశీయ విద్యకు పట్టుకొమ్మలైన ప్రభుత్వ పాఠశాలలు అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతతో కునారిల్లుతున్నాయి. మండల పరిదిలోని మిర్యాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు శిథిలావస్థకు చేరి, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. నాడు వైభవం.. నేడు అంధకారం : ఒకప్పుడు వెలుగులు చిమ్మిన ఈ పాఠశాల ప్రాంగణం, నేడు ఆవేదనకు అద్దం పడుతోంది.
తరగతి గదులు, ప్రయోగశాలలు అన్నీ ఆధునిక సౌకర్యాలకు దూరంగా, పాడుబడిన భవనాలుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలో అడుగుపెట్టగానే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రేకుల షెడ్లు కన్పిస్తాయి. ప్రయోగశాలగా పిలవబడే గదిలో, దశాబ్దాల క్రితం ఉపయోగించిన రసాయనాల సీసాలు, మైక్రోస్కోప్లు దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నాయి. ప్రయోగశాలకు కనీస సౌకర్యాలు లేకపోవడం, పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉండటం వల్ల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సి వస్తోంది. పాఠశాలలోని గ్రంథాలయం కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉంది.
పుస్తకాల కోసం ఏర్పాటు చేసిన అల్మారాలు తుప్పుపట్టి, పుస్తకాలన్నీ పాడైపోతున్నాయి. పైకప్పు నుండి పడుతున్న వర్షపు నీరు గ్రంథాలయానికి మరింత నష్టం కలిగిస్తోంది. ఒకప్పుడు పాఠశాల చైతన్యానికి ప్రతీకగా ఉన్న ఈ గ్రంథాలయం నేడు మూలనపడిన వస్తువుగా మిగిలిపోయింది.తరగతి గదుల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. గోడల ప్లాస్టరింగ్ ఊడిపోయి, సున్నం రాలిపోతోంది. ‘కాలమే బంగారం‘ వంటి నీతి వాక్యాలు కూడా గోడలపై మాసిపోతున్నాయి. విద్యార్థులు చదువుకోవడానికి కనీస బెంచీలు, టేబుల్లు లేకపోవడం శోచనీయం.
కనీస వసతులు కరువు : పాఠశాలలో మరుగుదొడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నీటి సౌకర్యం లేకపోవడం, అపరిశుభ్రత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారింది. మొత్తానికి పాఠశాలలో కనీస వసతులు కరువై విద్యార్థులు చదువుకోడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనం నిర్మించడంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యావంతులు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బడికి పంపాలంటేనే భయమేస్తుంది
మా పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. బడికి పంపాలంటేనే భయమేస్తోంది. వర్షం వస్తే చాలు, ఎక్కడ పైకప్పు కూలుతుందో అని కంగారు పడుతున్నాం. ప్రయోగశాల, లైబ్రరీ అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం ’మన ఊరు - మన బడి’ అని చెబుతున్నా, మా ఊరి బడికి మాత్రం ఆ అదృష్టం కలగలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయాలి.
కాస రవి, గ్రామస్తుడు
త్వరలోనే నివేదిక పంపిస్తాం
పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఇప్పటికే స్థానిక విద్యాశాఖ అధికారుల నుండి ప్రాథమిక సమాచారం సేకరించాం. పాఠశాలలోని తరగతి గదులు, ప్రయోగశాల మరియు గ్రంథాలయ పరిస్థితిని సమీక్షించి, మరమ్మతులు లేదా కొత్త భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపిస్తాం. విద్యార్థుల భద్రత మాకు ముఖ్యం, త్వరలోనే అవసరమైన చర్యలు చేపడతాం.
ఎంఈఓ రాములు నాయక్




