3 June, 2026 | 3:27 AM

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు

03-06-2026 12:10 AM

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎ.పి.జితేందర్ రెడ్డి.

గద్వాల, జూన్ 2 (విజయక్రాంతి)/గద్వాల: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, తెలంగాణ రైజింగ్ -2047 విజన్తో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఎ.పి.జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి న్యూ ఢిల్లీ & ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎ.పి.జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అతిథులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూజా కార్యక్రమం అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం సాంస్కృతిక సారధి కళాకారులచే తెలంగాణ గీత ఆలాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఎ.పి.జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వారి త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ, అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ప్రణామాలు తెలిపారు. 

అనంతరం బాలభవన్, దివ్య, రెబల్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో అలరించారు, వారి ప్రతిభను గుర్తిస్తూ ముఖ్య అతిథులు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, విద్య, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, యువజన క్రీడలు, వైద్య ఆరోగ్య, అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలక, పరిశ్రమల, పోలీస్, తదితర శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ జెడ్పి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. అనంతరం స్మృతి వనంలోని అమరవీరుల స్మారక స్థూపము వద్ద ముఖ్యఅతిథి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికా రులు పుష్పాంజలితో నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమములో తమ ప్రాణాలను అర్పించిన జిల్లా వాసులు పాశం సర్వరెడ్డి, కొట్టం వేణుగోపాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ముఖ్య అతిథి, ఇతర అతిధులు నివాళులర్పించారు.

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎస్పి శ్రీనివాసరావు, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, వాల్మీకి బోయ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్  జయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్లు మధు మోహన్, నర్సింగ రావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డిఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.