21 July, 2026 | 10:22 PM

Breaking News

విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు రైతుల వినతి

21-07-2026 08:06 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కేటాయించాలని గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ పరిధిలో సుమారు 2,300 ఎకరాల్లో వ్యవసాయం సాగుతుండగా, రైతులు తరచూ విద్యుత్ అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిలో పేర్కొన్నారు. సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించగా, నిజామాబాద్ సబ్‌స్టేషన్‌పై అధిక లోడ్ ఉండటంతో bవిద్యుత్ ఒత్తిడి తగ్గి తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని వివరించినట్లు తెలిపారు.

విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా వ్యవసాయ పంపుసెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటున్నాయని, దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కనగర్తి గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని, అందుకు అవసరమైన 20 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి విద్యుత్ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను రైతులు కోరారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడి వ్యవసాయానికి ఊరట లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్యాల స్వామిదాస్, ప్యాక్స్ వైస్ చైర్మన్ భూమ్ రెడ్డి తదితరులు వున్నారు.