16 July, 2026 | 1:47 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

16-07-2026 01:35 AM

విల్‌చైర్ల్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాలు, సపోర్ట్ స్టిక్లు అందజేత

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వారావుపేట, జూలై 15,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మరో సంక్షేమ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యాశాఖసమగ్ర శిక్ష తెలంగాణ మరియు అలిమ్కో (ALIMCO ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన 50 మంది దివ్యాంగ విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల సహాయక ఉపకరణాలను  స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పంపిణీ చేశారు. 

పంపిణీ చేసిన ఉపకరణాల్లో వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాలు, సపోర్ట్ స్టిక్లు, వాకింగ్ ఎయిడ్స్, ప్రత్యేక సహాయక పరికరాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి శారీరక పరిస్థితి, వైద్యుల సూచనలు మరియు అవసరాలను పరిశీలించిన అనంతరం వారికి అనువైన ఉపకరణాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదని, అది సమాజ బాధ్యత అని అన్నారు.

శారీరక వైకల్యం ఒక వ్యక్తి ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన అవకాశాలు, ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు కల్పిస్తే వారు అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను సమాజంలో సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించి, వారి విద్య, ఉపాధి, ఆరోగ్యం, పునరావాసం, స్వయం సమృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సమగ్ర శిక్ష పథకం ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయులు, థెరపీ సేవలు, స్కాలర్షిప్లు, రవాణా సౌకర్యాలు, సహాయక పరికరాలు అందిస్తున్నామని చెప్పారు.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలు విద్యకు దూరం కాకుండా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపారు. ఈ సహాయక పరికరాలు వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా, స్వయం ఆధారిత జీవితాన్ని గడపడానికి బలమైన తోడ్పాటుగా నిలుస్తాయని అన్నారు.

సహాయక ఉపకరణాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇతరుల సహాయంపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాల సహాయంతో స్వయంగా తమ పనులు చేసుకునే అవకాశం కలిగిందని తెలిపారు.

తమ పిల్లల భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయని, చదువులో మరింత ముందుకు వెళ్లేందుకు ఈ ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రతినిధులు, అలిమ్కో అధికారులు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విఅధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.