అనువుగానివి అంటగట్టారు!
నిరుపయోగంగా ప్యాడి డ్రయ్యర్లు
మహబూబాబాద్, జులై 20 (విజయక్రాంతి): స్థానిక పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లకు అణువు గాని విధంగా ఉన్న ప్యాడి డ్రైయ్యర్లను అంటగట్టారనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం కొనుగోళ్లలో ఒక శాతం పన్ను చెల్లించాల్సిన సివిల్ సప్లై కార్పొరేషన్ ఆ పన్నుకు బదులుగా రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లకు గత ఏడాది జూన్ నెలలో 14 లక్షల విలువైన ప్యాడి డ్రైయ్యర్లను సమకూర్చింది.
అయితే ప్యాడి డ్రైయ్యర్లు వినియోగానికి అణువుగా లేకపోవడంతో వాటిని వినియోగించకుండా వివిధ మార్కెట్లలో మూలకు పడేశారు. ఫలితంగా లక్షల రూపాయల విలువైన ప్యాడి డ్రైయ్యర్లు ఏడాదికాలంగా ఎందుకు పనికి రాకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి.
ధాన్యంలో తేమ అధికంగా ఉంటే రైతులు ధాన్యాన్ని అప్పటికప్పుడు ప్యాడి డ్రైయ్యర్ ద్వారా కృత్రిమంగా తేమశాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందుకుగాను రెండు టన్నుల ధాన్యం ప్యాడి డ్రైయ్యర్ ద్వారా ఆరబెట్టుకోవడానికి సుమారు 1500 రూపాయల డీజిల్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కృత్రిమంగా ప్యాడి డ్రైయ్యర్ ద్వారా ఆరబెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు కేటాయించిన ప్యాడి డ్రైయ్యర్ ను వినియోగించడానికి ప్రయత్నించగా ఇక్కడి రైతులకు ఆ ప్యాడి డ్రైయ్యర్ అంతగా అణువుగా ఉండదని రైతులు తేల్చేశారు. మార్కెట్లోకి విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని మొబైల్ ప్యాడి డ్రైయ్యర్ లో పోసి ఆరబెట్టుకోవడానికి డబ్బులతో పాటు కొంత శ్రమ చేయాల్సి ఉండడంతో, దీనికి బదులు పంట క్షేత్రంలోనే కళ్ళంలో అదనపు ఖర్చు లేకుండా ఆరబెట్టుకునే అవకాశం ఉండడంతో, రైతులు ప్యాడి డ్రైయ్యర్ ను వినియోగించడానికి ముందుకు రావడం లేదు.
ఫలితంగా ఏడాదికాలంగా మార్కెట్ కార్యాలయం పక్కనే వినియోగించకుండా ప్యాడీ డ్రైయ్యర్ ను వదిలేశారు. దీనితో లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ ప్యాడి డ్రైయ్యర్ యంత్రం ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. ఇదే తరహాలో జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్లో కూడా ప్యాడీ డ్రైయ్యర్ మూలకు పడింది. ఇలా రాష్ట్రంలోని అనేక మార్కెట్లలో లక్షల రూపాయల విలువచేసే ప్యాడీ డ్రైయ్యర్ యంత్రాలు ఎందుకు పనికి రాకుండా మూలకు పడ్డాయి.
ఎక్కడికక్కడే స్థానిక అవసరాలను, పరిస్థితులను అంచనా వేయకుండా అధికారులు అనాలోచిత చర్యల వల్ల లక్షల రూపాయల విలువైన యంత్రాలు ఉపయోగానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గానికి తగ్గట్టుగా, అణువుగా ఉండే యంత్రాలను కొనుగోలు చేసి ఇవ్వకుండా, అధికారుల ఆలోచన మేరకే పనులు చేపట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తున్నారు. ఒక్కనాడు కూడా వినియోగించని విధంగా ఉన్న మొబైల్ ప్యాడి డ్రైయ్యర్లను వెంటనే వెనక్కి తీసుకొని, రైతులకు అణువుగా ఉండే విధంగా యంత్రాలను కేటాయించాలని కోరుతున్నారు.
మేం కొనలేదు.. వారే పంపారు
ప్యాడి డ్రైయ్యర్లను తాము కొనుగోలు చేయలేదని, తమకు దాన్యం కొనుగోలుకు సంబంధించిన ఒక శాతం మార్కెట్ ఫీజు బదులుగా సివిల్ సప్లై కార్పొరేషన్ తమకు ప్యాడి డ్రైయ్యర్లను పంపించిందని కేసముద్రం మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేసముద్రం మార్కెట్ కు కేటాయించిన ప్యాడి డ్రైయ్యర్ పనితీరు పట్ల రైతులు ఆసక్తి చూపడం లేదని, దీనితో మొబైల్ ప్యాడీ డ్రైయ్యర్ వినియోగించలేకపోతున్నట్టు చెప్పారు.






