గోదావరి వంతెనపై మహిళ ఆత్మహత్యాయత్నం
స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
బూర్గంపాడు, (విజయక్రాంతి): భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను స్థానికులు అప్రమత్తంగా స్పందించి రక్షించారు. ములకలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన గొళ్లమూడి శైలజ (37) సోమవారం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న స్థానికులు వెంటనే గమనించి అడ్డుకుని కాపాడారు.
సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శైలజను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో తన ఇంటి స్థలాన్ని మరిది గొళ్లపూడి రమేశ్ అక్రమంగా ఆక్రమించుకున్నాడని, తన భర్తపై ఉద్దేశపూర్వకంగా వివిధ కేసులు నమోదు చేయిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కుటుంబ వివాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. స్థానికుల అప్రమత్తతతో పెను విషాదం తప్పిందని పోలీసులు తెలిపారు.






