28 February, 2026 | 6:13 PM

సేంద్రియ వ్యవసాయంతో మేలు

28-02-2026 01:49 AM

కొమురవెల్లి, ఫిబ్రవరి 27 సేంద్రీయ వ్యవసాయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక అన్నారు. మండల పరిధిలోని రసులాబాద్ లో గల సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు రసాయనక ఎరువులతో పాటు పురుగు మందులు మోతాదుకు మించి వాడితే పెట్టుబడులు పెరగడం తో పాటు పంటలకు అధికంగా తెగుళ్లు సోకుతాయని అన్నారు.

రసాయనిక ఎరువులు వినియోగించడం వల్ల భూసారం సేంద్రీయ కర్బనం దెబ్బతిని పంట దిగుబడి కూడా తగ్గుతుందని ఆమె సూచించారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి మాట్లాడుతూ రైతులు భూసారం పెంచుకోవడానికి , పంట దిగుబడులను రెట్టింపు చేసుకోవడానికి జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని రైతులు వాడుకోవాలని సూచించారు.

ప్రాచీన కాలంనాటి వరి వంగడాలైన చిట్టి ముత్యాలు, కాలా నమ్మక్, ఎర్ర బియ్యం లాంటి వంగడాలు ఆత్మ కమిటీ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే వెంకటరావమ్మ, ఆత్మ డైరెక్టర్ చింతల పరుశరాములు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.